Maharashtra: ఉద్దవ్ వర్గానికి ఊరట.. తమ తీర్పు వెలువడేంతవరకు వేటు వద్దన్న సుప్రీం
న్యూఢిల్లీ, జూలై 11: శివసేన శాసన సభ్యులకు జారీచేసిన అనర్హత నోటీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని సుప్రీం కోర్టు మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను సోమవారం ఆదేశించింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారీ, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సంబంధిత పిటిషన్లను విచారించింది. తమ ఉత్వర్వులను మహారాష్ట్ర సభాపతికి తెలియజేయాలని మహారాష్ట్ర గవర్నర్ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
ఉద్దవ్ థాకరే వర్గం తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ పిటిషన్లను ధర్మాసనం వద్ద ప్రస్తావించారు. అత్యవసరంగా విచారించాలని, విచారణ ఈరోజు ఉండాల్సిందని, కానీ జాబితాలో లేవని ప్రస్తావించారు.
‘డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్ రేపు సభాపతి ముందుకు రానుంది. ఈ పిటిషన్లపై విచారణ పూర్తయ్యేంతవరకు డిస్‌క్వాలిఫికేషన్‌పై సభాపతి ఎలాంటి చర్య తీసుకోకుండా ఆదేశించాలి..’ అని సిబల్ ధర్మాసనాన్ని కోరారు.
తాము ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేంతవరు సభాపతి అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, ఈ ఆదేశాలను సభాపతికి చేరవేయాలని సొలిసిటర్ జనరల్‌ను ఈనేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు.
ఈ అంశాన్ని విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనం అవసరమని, అందువల్ల లిస్ట్ చేసేందుకు కొంత సమయం అవసరం అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ పిటిషన్ రేపు కూడా లిస్టవదని స్పష్టం చేసింది.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించిన పలు పిటిషన్లను వెకేషన్ బెంచ్ జూలై 11కు వాయిదా వేసింది. శివసేనలోని రెండు వర్గాలకు సంబంధించిన పలు పిటిషన్లు ధర్మాసనం ముందు విచారణకు రావాల్సి ఉంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏక్‌నాథ్ షిండేను గవర్నర్ ఆహ్వానించడంపై, అలాగే సభాపతి ఎన్నిక, విశ్వాస పరీక్ష తదితర అంశాలపై ఉద్దవ్ థాకరే వర్గం ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అలాగే ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన వ్యక్తిని శివసేన విప్‌గా సభాపతి గుర్తించడాన్ని కూడా ఉద్దవ్ థాకరే వర్గం కోర్టులో సవాలు చేసింది. ఉద్దవ్ థాకరే ఇప్పటికీ శివసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున షిండే నామినేట్ చేసి వ్యక్తిని విప్‌గా గుర్తించడం సభాపతి పరిధిలో లేదని వాదిస్తోంది.
డిస్‌క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న ఏక్‌నాథ్ షిండే, మరో 15 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని థాకరే క్యాంపులోని సునీల్ ప్రభు పిటిషన్ దాఖలు చేశారు.
కాగా తమ వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ నోటీసులు ఇవ్వడాన్ని షిండే వర్గం సుప్రీం కోర్టులో సవాలు చేసింది.
కాగా జూన్ 29న మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సుప్రీం కోర్టు అనుమతించింది.