Ukraine | జవాను జీవితాన్ని కాపాడిన 'స్మార్ట్‌ఫోన్'.. ఎలా అంటే..!
ఉక్రెయిన్: రష్యాతో యుద్ధంలో ఓ సైనికుడు.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఓ స్మార్ట్‌ఫోన్ అతడి జీవితాన్ని కాపాడేసింది. అది ఎలా అంటే..
Russia Ukraine war | రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎన్నో కథలు బయటకొస్తున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ సైనికుల వీరోచిత పోరాటలకు సంబంధించిన వార్తలు.. ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నాయి. ఈ యుద్ధంలో ఎందరో వీరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఓ ఉక్రెయిన్ సైనికుడు.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటన.. తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడిని రక్షించింది.. తోటి జవాను కాదు.. ఓ స్మార్ట్‌ఫోన్!
ఇందుకు సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమం రెడిట్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఓ సైనికుడు.. మరో జవానుతో మాట్లాడటం అందులో కనిపిస్తుంది. ఆ సైనికుడు తన జేబులో నుంచి ఓ స్మార్ట్‌ఫోన్ బయటకు తీశాడు. దానికి ఓ పెద్ద బుల్లెట్ అతుక్కుని ఉండటం గమనార్హం. అంటే ప్రత్యర్థులు కాల్చిన బుల్లెట్లలో ఒకటి.. ఆ సైనికుడిని తాకింది. కానీ ఆ సమయంలో స్మార్ట్‌ఫోన్ అడ్డుగా ఉండటంతో ఆ సైనికుడు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు.
Ukraine soldiers | ఓ 7.2ఎంఎం సైజు బుల్లెట్.. ఆ స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోయింది. దాదాపు ఆ బుల్లెట్.. ఆ స్మార్ట్‌ఫోన్‌ను దాటేసినట్టుగానే ఉంది. కానీ అలా జరగలేదు. అదే జరిగి ఉంటే.. ఆ సైనికుడికి బుల్లెట్ తగిలేది. అప్పుడేం జరిగేతే ఊహించుకునేందుకే చాలా బాధాకరంగా, భయంకరంగా ఉంది.
ఈ వార్త వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిపోయింది. కాగా నెటిజన్లు దీనిపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. 'అది నోకియా ఫోన్ అయితే.. ఇంకా పనిచేస్తుంది,' అని కొందరు అంటుంటే.. 'అది నోకియా ఫోన్ అయ్యుంటే.. ఆ బుల్లెట్.. ఫోన్‌ను తగిలి తిరిగి ప్రత్యర్థి మీదకే వెళ్లేది,' అని ఫన్నీగా రాసుకొస్తున్నారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. ఫిబ్రవరి 24న మొదలైంది. ఇంకా కొనసాగుతోంది. ఇందులో ఎన్నో హృదయ విదారక ఘటనలు, దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతర్జాతీయ సమాజం ఎంత ఒత్తిడి చేస్తున్నా.. రష్యా మాత్రం ఊచకోతను ఆపడం లేదు.
'లొంగిపోండి.. లేకపోతే..'
Ukraine crisis | రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా.. ఉక్రెయిన్ సైనికులకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తక్షణమే ఆయుధాలను వీడి లొంగిపోవాలని తేల్చిచెప్పింది. భీకర పోరాటం జరుగుతున్న మారియుపోల్‌లోని ఉక్రెయిన్ బలగాలను ఉద్దేశించి రష్యా ఈ ప్రకటన చేసింది.
"ఉక్రెయిన్ దళాలు అర్థం లేని విధంగా పోరాటం చేస్తున్నాయి. వాటిని వెంటనే ఆపాలని ఉక్రెయిన్ అధికారులు.. సైనికులకు చెబితే మంచిది. కానీ ఇలాంటి సూచనలు ఉక్రెయిన్ అధికారులు చెయ్యరని మాకు తెలుసు. అందుకే.. సైనికులే స్వచ్ఛందంగా ఆయుధాలు వీడాలని, లొంగిపోవాలని మేము చెబుతున్నాము," అని రష్యా రక్షణశాఖ.. మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతంలో రష్యా దాడులు మొదలుపెట్టిందని ఉక్రెయిన్ ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దేశం ఇలాంటి ప్రకటనను విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మారియుపోల్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, రష్యా దళాల చేతులో ఉక్రెయిన్ సైనికులు ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఖాయమని ఆ దేశ రక్షణశాఖ అభిప్రాయపడింది. అందువల్ల.. సైనికులు ఆయుధాలను వీడితే మంచిదని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొంది. ఆయుధాలు వీడితే.. వదిలేస్తామని, బ్రతకనిస్తామని హామీనిచ్చింది.
సంబంధిత కథనం
టాపిక్