'ఆయుధాలు వీడండి..' ఉక్రెయిన్ సైనికులకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్
ఉక్రెయిన్ సైనికులకు రష్యా మరోమారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆయుధాలు వీడి లొంగిపోవాలని పేర్కొంది. అప్పుడు ప్రాణాలతో బ్రతకనిస్తామని స్పష్టం చేసింది.
Russia Ukraine war | రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. తాజాగా.. ఉక్రెయిన్ సైనికులకు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తక్షణమే ఆయుధాలను వీడి లొంగిపోవాలని తేల్చిచెప్పింది. భీకర పోరాటం జరుగుతున్న మారియుపోల్‌లోని ఉక్రెయిన్ బలగాలను ఉద్దేశించి రష్యా ఈ ప్రకటన చేసింది.
"ఉక్రెయిన్ దళాలు అర్థం లేని విధంగా పోరాటం చేస్తున్నాయి. వాటిని వెంటనే ఆపాలని ఉక్రెయిన్ అధికారులు.. సైనికులకు చెబితే మంచిది. కానీ ఇలాంటి సూచనలు ఉక్రెయిన్ అధికారులు చెయ్యరని మాకు తెలుసు. అందుకే.. సైనికులే స్వచ్ఛందంగా ఆయుధాలు వీడాలని, లొంగిపోవాలని మేము చెబుతున్నాము," అని రష్యా రక్షణశాఖ.. మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతంలో రష్యా దాడులు మొదలుపెట్టిందని ఉక్రెయిన్ ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆ దేశం ఇలాంటి ప్రకటనను విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మారియుపోల్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, రష్యా దళాల చేతులో ఉక్రెయిన్ సైనికులు ఉక్కిరిబిక్కిరి అవ్వడం ఖాయమని ఆ దేశ రక్షణశాఖ అభిప్రాయపడింది. అందువల్ల.. సైనికులు ఆయుధాలను వీడితే మంచిదని మరోమారు విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొంది. ఆయుధాలు వీడితే.. వదిలేస్తామని, బ్రతకనిస్తామని హామీనిచ్చింది.
సంబంధిత కథనం
టాపిక్