రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డులు జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. సవివరమైన నోటిఫికేషన్ rrbald.gov.in ఆర్ఆర్బీ అలహాబాద్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 7951 పోస్టులను భర్తీ చేయనున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 30న ప్రారంభమై 2024 ఆగస్టు 29న ముగుస్తుంది. సవరణ రుసుము చెల్లించి దరఖాస్తు ఫారంలో దిద్దుబాట్ల కోసం మాడిఫికేషన్ విండో ఆగస్టు 30న ప్రారంభమై సెప్టెంబర్ 8, 2024తో ముగుస్తుంది.
అన్ని పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలను పోస్ట్ ల వారీగా ఆర్ఆర్బీ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి.
ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ (ME) దశల్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మొదటి దశ, రెండో దశ అని రెండు దశల్లో ఉంటుంది. సీబీటీలో ప్రతి తప్పు సమాధానానికి కేటాయించిన మార్కులో 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
అప్లికేషన్ ఫీజుగా రూ.500/- చెల్లించాలి. మొదటి దశ సీబీటీకి హాజరైన తర్వాత బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.400 తిరిగి చెల్లిస్తారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా యూపీఐ ద్వారా మాత్రమే ఆన్లైన్ ఫీజు చెల్లింపును స్వీకరిస్తారు. వర్తించే అన్ని సర్వీస్ ఛార్జీలను అభ్యర్థి భరించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.