Rishi Sunak UK next PM : బ్రిటన్​ ప్రధాని రేసులో రిషి సునక్​ ముందంజ!-rishi sunak favourite to be uk next pm ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rishi Sunak Uk Next Pm : బ్రిటన్​ ప్రధాని రేసులో రిషి సునక్​ ముందంజ!

Rishi Sunak UK next PM : బ్రిటన్​ ప్రధాని రేసులో రిషి సునక్​ ముందంజ!

Sharath Chitturi HT Telugu
Oct 22, 2022 09:00 AM IST

Rishi Sunak UK PM news : బ్రిటన్​ ప్రధాని రేసులో ఉన్నట్టు రిషి సునక్​ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఆయనకు మద్దతు పెరుగుతోందని ఓ సర్వే వెల్లడించింది.

బ్రిటన్​ ప్రధాని రేసులో రిషి సునక్​ ముందంజ
బ్రిటన్​ ప్రధాని రేసులో రిషి సునక్​ ముందంజ (REUTERS)

Rishi Sunak UK PM news : బ్రిటన్​ ప్రధానమంత్రి రేసులో రిషి సునక్​ ముందంజలో ఉన్నట్టు సమాచారం. ఆయనకు 100మంది పార్టీ ఎంపీల మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది.

లిజ్​ ట్రస్​ రాజీనామాతో..

లిజ్​ ట్రస్​ అనూహ్య రాజీనామాతో బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక మళ్లీ ప్రధాని రేసు మొదలైంది. కాగా.. తదుపరి ప్రధాని రేసులో ఉన్నట్టు రిషి సునక్​ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పటివరకు పెన్నీ మోర్డౌంట్​ మాత్రమే.. బ్రిటన్​ ప్రధాని రేసులో అధికారికంగా చేరారు. మరోవైపు.. బ్రిటన్​ మాజీ ప్రధాని బోరిస్​ జాన్స్​న్​ కూడా రేసులో ఉండొచ్చని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

Rishi Sunak UK next PM : ఈసారి కేవలం ముగ్గురు మాత్రమే ప్రధానమంత్రి రేసులో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కనీసం 100మంది కన్జర్వేటివ్​ ఎంపీల మద్దతు ఉంటేనే.. ఎవరైనా ప్రధాని రేసులోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. కాగా.. రిషి సునక్​కు 100మంది ఎంపీల మద్దతు లభించిందని కన్జర్వేటివ్​ పార్టీ ఎంపీ డోబియాస్​ ఎల్​వుడ్​ ట్వీట్​ చేశారు.

ఇక బ్రిటన్​ ప్రధాని రేసులో పాల్గొంటున్నట్టు రిషి సునక్​ అధికారికంగా ప్రకటించడమే తరువాయి!

రేసులో రిషి సునక్​ ముందంజ..!

UK PM race : తదుపరి బ్రిటన్​ ప్రధానిపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అనేక సంస్థలు సర్వేలు చేపడుతున్నాయి. ఒక ఒపీనియన్​ పోల్​ ప్రకారం.. మోర్డౌంట్​, జాన్సన్​ కన్నా ఓటర్లు రిషి సునక్​వైపే మొగ్గుచూపొచ్చని తేలింది. సర్వేలో పాల్గొన్న 44శాతం మంది రిషి సునక్​కే తమ మద్దతు తెలిపారు.

అయితే.. రేసులో తాను కూడా ఉంటానని, ఓటర్ల మద్దతు సంపాదిస్తానని బోరిస్​ జాన్సన్​ తన సన్నిహితులకు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా.. బోరిస్​ జాన్సన్​ రేసులో ఉంటే.. పార్టీ పతనమవుతుందని రిషి మద్దతుదారులు భావిస్తున్నట్టు సమాచారం. బోరిస్​ పోటీ చేయకూడదని వారు చెబుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బోరిస్​ మళ్లీ ప్రధాని బాధ్యతలు తీసుకుంటే.. బ్రిటన్​ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమవుతుందని.. రిషి సునక్​ మద్దతుదారులు ప్రచారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కన్జర్వేటివ్​ పార్టీ సభ్యులు గత ఆరేళ్లల్లో.. ఐదొవ ప్రధానిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ సంక్షోభం…

UK political crisis : పార్టీలో చీలక నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు బోరిస్​ జాన్సన్​. జులై నుంచి సెప్టెంబర్​ వరకు తదుపరి ప్రధాని ఎన్నిక కార్యకలాపాలు జరిగాయి. తొలుత రిషి సునక్​.. రేసులో దూసుకెళ్లారు. కానీ ఆ తర్వాత ఆయనకు మద్దతు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో.. బ్రిటన్​ ప్రధానిగా సెప్టెంబర్​ తొలి వారంలో బాధ్యతలు స్వీకరించారు లిజ్​ ట్రస్​.

కొత్త ప్రధానిపై దేశ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. బ్రిటన్​ రాజకీయ సంక్షోభానికి తెరపడిందని భావించారు. కానీ 45రోజుల పదవీకాలం అనంతరం లిజ్​ ట్రస్​.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పన్ను వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల నేపథ్యంలో ఆమెకు సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది. ఫలితంగా బ్రిటన్​ రాజకీయ సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది! ఇక ఇప్పుడైనా రిషి సునక్​ గెలుస్తారా? అన్నది వేచి చూడాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం