Set back to BJP: కర్నాటక రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి షాక్; పార్టీ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్
Rajya Sabha elections 2024: రాజ్య సభ ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి, కాంగ్రెస్ కు ఓటేశారు. కర్ణాటకలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు పోటీ చేశారు.
రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో కర్నాటకలో కాంగ్రెస్ పోటీ చేసిన మూడు స్థానాలను గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ వరుసగా 47, 46, 46 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి నారాయణరెడ్డి ఒక్కరే విజయం సాధించారు.
బీజేపీ ఎమ్మెల్యే క్రాస్ ఓటింగ్
కర్నాటకలో నాలుగు స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి డీ కుపేంద్ర రెడ్డి సహా ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. క్రాస్ ఓటింగ్ తో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒకరైన ఎస్ టీ సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి మాకెన్ కు ఓటు వేయగా, మరొక ఎమ్మెల్యే శివరాం హెబ్బార్ ఓటింగ్ కు గైర్హాజరయ్యారు. తన నియోజకవర్గంలో నీరు, ఇతర ప్రజోపయోగ పనులకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన వారికి ఓటు వేస్తానని సోమశేఖర్ కాంగ్రెస్ నేతకు ఓటు వేసే ముందు చెప్పారు. కాగా, క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన తమ శాసనసభ్యుడిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ తెలిపింది.
డీకే హర్షం
రాజ్యసభ ఎన్నికల విజయంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు, పార్టీ కార్యకర్తలకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులందరూ గెలిచారని తెలియజేయడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓటర్లకు, సీఎం, పార్టీ కార్యకర్తలకు, ఏఐసీసీ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణ్ దీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ లకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన అభ్యర్థులు ధన్యవాదాలు తెలిపారు. ‘‘వారు చాలా కష్టపడ్డారు, వారికి మాపై నమ్మకం ఉంది. మా ఎమ్మెల్యేలను బీజేపీ, జేడీఎస్ వ్యూహాలకు బలైపోనివ్వలేదు" అని గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులలో ఒకరైన నసీర్ హుస్సేన్ తన విజయంపై అన్నారు.