Presidential election : విపక్షాల మధ్య చీలిక.. రాష్ట్రపతి ఎన్నికలో 'క్రాస్ ఓటింగ్'- ముగిసిన పోలింగ్
Presidential election 2022: రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం జరిగిన పోలింగ్ ముగిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనేక రాష్ట్రాల్లో ‘క్రాస్ ఓటింగ్’ జరిగినట్టు వార్తలు వచ్చాయి.
Presidential election 2022: భారత దేశ చరిత్రలో మరో కీలక ఘట్టానికి తెరపడింది. దేశం ఎదురుచూసిన రాష్ట్రపతి ఎన్నిక సోమవారం ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలువురు 'క్రాస్ ఓటింగ్'కు పాల్పడి.. విపక్షాల మధ్య ఉన్న విభేదాలను మరోమారు బయటపెట్టారు.
ఇలా సాగింది..
ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము- విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా మధ్య రాష్ట్రపతి పోరు ఉందన్న విషయం తెలిసిందే. కాగా.. సోమవారం పార్లమెంట్‌తో పాటు వివిధ రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీల్లో ఓటింగ్ జరిగింది. ఉదయం 10 గంటలకు మొదలైంది పోలింగ్.. సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
ఈ మధ్యలో అనేక మంది ప్రముఖ రాజకీయ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు వేశారు. అనంతరం కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Draupadi Murmu vs Yashwant Sinha : మరోవైపు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్, దిగ్విజయ్ సింగ్‌లు పార్లమెంట్లో ఓట్లు వేశారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 89ఏళ్ల మన్మోహన్ సింగ్.. వీల్‌ఛైర్ మీద పార్లమెంట్‌కు వెళ్లి ఓటేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చాలా కాలం తర్వాత మీడియాకు కనిపించారు.
కాగా.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో సీఎంలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్, పశ్చిమ్ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో విపక్ష నేత, ఎస్పీ అధినేత అఖిలేషన్ యాదవ్ సైతం ఓటు వేశారు. ఆయన తండ్రి, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయాం సింగ్ యాదవ్.. వీల్‌ఛైర్‌పై శాసనసభకు వెళ్లి బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేశారు.
క్రాస్ ఓటింగ్..
'ఎన్డీఏకు మెజారిటీ ఉండటంతో ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమే. కానీ యశ్వంత్ సిన్హాపై ఎంత మెజారిటీతో గెలుస్తారు? అన్నదే ఇక్కడ అసలైన విషయం..' గత కొంతకాలంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఇది.
ఇది నిజమే. బీజేపీకి చాలా మెజారిటీ ఉంది. దీనితో పాటు వైసీపీ, టీడీపీ, బీజేడీ వంటి పార్టీలు కూడా ముర్ముకు మద్దతు ప్రకటించాయి.
ఓటమి ఖాయమని తెలిసినా.. ఈ ఎన్నికతో తమ మధ్య ఉన్న ఐకమత్యాన్ని చాటిచెబుదామని భావించిన విపక్షాలకు సోమవారం గట్టి ఎదురుదెబ్బే తగిలింది! చాలా రాష్ట్రాల్లో 'క్రాస్ ఓటింగ్' జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
Cross voting in President Election : రాష్ట్రపతి ఎన్నికలో తాము చెప్పిన అభ్యర్థికే ఓటు వేయాలని పార్టీలు విప్‌ను జారీ చేయలేవు. అందువల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయవచ్చు. అయితే.. సాధారణంగా విప్ జారీ చేయకపోయినా.. పార్టీ చెప్పినదాన్నే ఎంపీలు, ఎమ్మెల్యేలు అనుసరిస్తూ ఉంటారు.
కాగా.. హరియాణాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్.. ముర్ముకు ఓటు వేసినట్టు ప్రకటించారు. 'నా మనసుకు నచ్చింది చేశాను,' అని ఆయన అనడం గమనార్హం. ఒడిశాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే మహమ్మద్ ముఖీమ్ కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేశారు. 'మనసు మాట విన్నాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. నా భూమి కోసం ఏదైనా చేయాలి అని నా మనసు చెప్పింది,' అని ఆయన అన్నారు. ఎన్డీఏ ఎంపిక చేసిన ద్రౌపది ముర్ము.. ఒడిశాకు చెందిన వారు.
తెలంగాణలో కాంగ్రెస్ నేత సీతక్క సైతం ముర్ముకే ఓటేశారు.
కాగా.. అసోంలో దాదాపు 20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లోనూ క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు చెలరేగాయి. మధ్యప్రదేశ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ కొట్టిపారేసింది.
మరోవైపు గుజరాత్లో ఎన్సీపీ ఎమ్మెల్యే కాన్ధాల్ జడేజా సైతం ముర్ముకే ఓటు వేశారు. ఇప్పటివరకు విపక్షాలతో కలిసి తిరిగిన శివసేన కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేసింది.
క్రాస్ ఓటింగ్ వార్తల్లో.. ఎక్కువగా కాంగ్రెస్ సభ్యులే ఉండటం గమనార్హం.
21న కౌంటింగ్..
Presidential election 2022 : ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్ పదవీకాలం.. మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈలోపు.. ఈ నెల 21న రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు ఫలితాలు వెలువడతాయి. అందులో గెలిచిన అభ్యర్థి.. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేస్తారు.
సంబంధిత కథనం