PM Modi tweet on Pakistan floods : పాకిస్థాన్​​ వరదలపై ప్రధాని మోదీ ట్వీట్​-pm modi extends condolences to pakistan flood victims ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Tweet On Pakistan Floods : పాకిస్థాన్​​ వరదలపై ప్రధాని మోదీ ట్వీట్​

PM Modi tweet on Pakistan floods : పాకిస్థాన్​​ వరదలపై ప్రధాని మోదీ ట్వీట్​

Sharath Chitturi HT Telugu
Aug 29, 2022 10:05 PM IST

PM Modi tweet on Pakistan floods : పాకిస్థాన్​ వరదలతో ప్రభావితమైన బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

సురక్షిత కేంద్రాల్లో నివాసముంటున్న చిన్నారుల పరిస్థితి
సురక్షిత కేంద్రాల్లో నివాసముంటున్న చిన్నారుల పరిస్థితి (AP)

PM Modi tweet on Pakistan floods : పాకిస్థాన్​ వరదలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ప్రకృతి విపత్తుతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

"పాకిస్థాన్​లో వరదలు సృష్టించిన బీభత్సం గురించి విని చాలా బాధ కలిగింది. బాధితులు, గాయపడిన వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. పాకిస్థాన్​లో పరిస్థితులు తొందరగా సాధారణ స్థితికి చేరాలని ప్రార్థిస్తున్నాము," అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు.

ఆ దేశంలో 5.7మిలియన్​ మందిపై పాకిస్థాన్​ వరదల ప్రభావం పడింది. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ప్రకృతి విపత్తు నేపథ్యంలో ఆ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు పాక్​ ప్రధాని షెహ్​బాజ్​ షరీఫ్​.

1,100కు చేరువలో మరణాల సంఖ్య..

Pakistan floods death toll : పాకిస్థాన్​ వరదల్లో మృతుల సంఖ్య ఆదివారం 1000 మార్కును దాటగా.. సోమవారం అది 1,100కు చేరువైంది. మొత్తం మీద వరదలకు ఇప్పటివరకు 1,061మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉండటం ఆందోళనకరం. 1,575మంది గాయపడ్డారు.

పరిస్థితులు చూస్తుంటే.. పాక్​పై ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది! అక్కడి సహాయక చర్యలపైనా వరదల ప్రభావం పడుతోంది. సింధ్​ నదిపై.. 30మందితో వెళుతున్న ఓ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో 11మంది మరణించారు. అనేకమంది గల్లంతయ్యారు. ఏడుగురుని అధికారులు రక్షించారు.

దేశవ్యాప్తంగా 9,92,871 ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయి. 10లక్షలకుపైగా మంది ప్రజలు.. ఆహారం, తాగు నీరు లేని పరిస్థితుల్లో ఉన్నారు.

పాకిస్థాన్​ వరదలకు 7,19,558 జంతువులు మరణించాయి. లక్షలాది ఎకరాల పంట భూమి నీటమునిగింది.

Pakistan floods 2022 : ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​ తల మీద వరదల రూపంలో మరో భారం పడింది. సాయం చేయాలని వివిధ దేశాలను పాకిస్థాన్​ అభ్యర్థిస్తోంది.

పాకిస్థాన్​ వరదల కారణంగా ఇప్పటికే బిలియన్​ డాలర్ల నష్టం జరిగినట్టు అంచనా. పాకిస్థాన్​లో తాజా పరిస్థితిని పరిశీలించిన ఐక్యరాజ్య సమితి.. ఆ దేశానికి తక్షణమే 160 మిలియన్​ డాలర్ల ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధపడిందని తెలుస్తోంది. అదే సమయంలో.. పాకిస్థాన్​ మిత్రపక్షాలు కూడా.. తమ వంతు సాయం చేస్తున్నాయి. 1.5మిలియన్​ పౌండ్ల సాయాన్ని ప్రకటించింది యూకే. నిధులతో పాటు 3వేల టన్నుల ఆహార పదార్థాలను కూడా పాక్​కు పంపుతోంది యూఏఈ.

పాక్​ తాజా పరిస్థితులపై చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాక్​కు సాయం చేస్తామని ఆయన చెప్పినట్టు సమాచారం.

IPL_Entry_Point

సంబంధిత కథనం