పతంజలి ఫుడ్ బిజినెస్ ఇక రుచీ సోయా పరిధిలోకి..
పతంజలి ఫుడ్ బిజినెస్ రుచీ సోయా సంస్థ పరిధిలోకి వెళ్లనుంది.
న్యూఢిల్లీ, మే 18: బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ కంపెనీ తన ఫుడ్ రీటైల్ బిజినెస్‌ను అదే గ్రూపునకు చెందిన రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు రూ. 690 కోట్లకు విక్రయించనుంది. ఆహారేతర వ్యాపారం, సాంప్రదాయ ఔషధాలు, వెల్‌నెస్ బిజినెస్‌పై దృష్టి పెట్టే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
రుచి సోయా కంపెనీని పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ దివాలా ప్రక్రియలో భాగంగా కొనుగోలు చేసింది. తాము పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌తో బిజినెస్ ట్రాన్స్‌ఫర్ అగ్రీమెంట్ కుదుర్చుకున్నట్టు రుచి సోయా సెబీకి తెలియపరిచింది.
ఆహార ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్, లేబులింగ్, రీటైల్ ట్రేడింగ్ కలగలిపి ఉన్న ఫుడ్ రీటైల్ బిజినెస్‌ను రుచి సోయా కొనుగోలు చేయనుంది. ఇందులోభాగంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న తయారీ ప్లాంట్లు కూడా బదిలీ అవుతాయి.
ఉద్యోగులు, ఆస్తులు (పతంజలి బ్రాండ్, ట్రేడ్ మార్క్స్, డిజైన్లు, కాపీరైట్లు మినహాయించి), కరెంట్ అసెట్స్ (వాహనాలు, నగదు, బ్యాంకు నిల్వలు మినహాయించి), కాంట్రాక్ట్స్, లైసెన్సులు, పర్మిట్లు, పంపిణీ నెట్ వర్క్, ఫుడ్ రీటైల్ బిజినెస్ కస్టమర్లు.. ఇలా అన్నీ రుచి సోయాకు బదిలీ అవుతాయి.
అలాగే రుచీ సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరును పతంజలి ఫుడ్స్ లిమిటెడ్‌గా మార్చేందుకు కూడా బోర్డు అంగీకరించింది.
రుచీ సోయా ఇటీవలే రూ. 4,300 కోట్లను ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) పద్ధతిలో సమీకరించింది. రానున్న కొన్ని నెలల్లో పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ తన ఫుడ్ బిజినెస్‌ను రుచీ సోయాకు బదిలీ చేయనున్నట్టు కొన్ని నెలల క్రితం బాబా రాందేవ్ వెల్లడించారు. రుచీ సోయా వంట నూనెలు, ఫుడ్, ఎఫ్ఎంసీజీ, న్యూట్రాస్యూటికల్స్, ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌పై దృష్టిసారిస్తుందని కూడా వెల్లడించారు.
గత ఏడాది పతంజలి తన బిస్కెట్ బిజినెస్‌ను రూ. 60 కోట్ల నామమాత్రపు ధరకు రుచీ సోయా సంస్థకు బదిలీ చేసింది.
రానున్న ఐదేళ్లలో పతంజలి ఆయుర్వేద్, రుచీ సోయా సంస్థలను భారతదేశపు అతిపెద్ద ఫుడ్, ఎఫ్ఎంసీజీ కంపెనీగా తయారు చేయాలన్నదే తమ లక్ష్యమని బాబా రాందేవ్ వివరించారు. హిందుస్తాన్ యూనిలివర్ లిమిటెడ్ తరువాత, పతంజలి ఆయుర్వేద్ ప్రస్తుతం దేశంలోనే రెండో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థ అని వివరించారు.
పతంజలి ఆయుర్వేద్ గ్రూప్, దాని సబ్సిడరీ రుచీ సోయా సంస్థల సంయుక్త వార్షిక టర్నోవర్ రూ. 35 వేల కోట్లుగా ఉంది.
రుచీ సోయా సంస్థను పతంజలి గ్రూప్ 2019లో దివాళా ప్రక్రియలో భాగంగా రూ. 4,350 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.
సంబంధిత కథనం
టాపిక్