Video: మహిళా సిబ్బందితో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన! విమానం దించేసి..: వీడియో
SpiceJet Flight Incident - Video: సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడిని విమానం నుంచి దించేసినట్టు స్పైస్‍జెట్ ప్రకటించింది. ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో కూడా బయటికి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే..
SpiceJet Flight Incident - Video: ఇటీవలి కాలంలో విమానాల్లో అనూహ్య ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. స్పైస్‍జెట్ విమానంలో ఓ ఘటన నేడు (జనవరి 23) జరిగింది. మహిళా ఉద్యోగి పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని విమానం నుంచి దించేసినట్టు స్పైస్‍జెట్ ప్రకటించింది. భద్రతా సిబ్బందికి అప్పగించినట్టు తెలిపింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‍కు వస్తున్న విమానంలో ఇది చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా బయటికి వచ్చింది. పూర్తి వివరాలు ఇవే..
ఇదీ జరిగింది
SpiceJet Plane Incident - Video: విమానంలోని ఓ మహిళా ఉద్యోగితో ఓ పురుష ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణతో విమానంలో వాగ్వాదం జరిగింది. విమాన సిబ్బంది, ప్రయాణికుల మధ్య వాదన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా బయటికి వచ్చింది. న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ విషయంపై స్పైస్‍జెట్ కూడా అధికారిక ప్రకటన చేసింది.
“జనవరి 23, 2023 తేదీన ఎస్‍జీ-8133 (ఢిల్లీ-హైదరాబాద్) కొరెండోన్ విమానం.. ఢిల్లీలో బయలు దేరే సమయంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బంది పట్ల అనుచితంగా, వికృతంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని సిబ్బంది.. పీఐసీతో పాటు సెక్యూరిటీ స్టాఫ్‍కు ఫిర్యాదు చేశారు. ఆ ప్రయాణికుడిని, అతడికి తోడుగా వచ్చిన మరో వ్యక్తిని విమానం నుంచి దించేశారు” అని స్పైస్‍జెట్ పేర్కొంది.
“అసభ్యంగా ప్రవర్తించారు”
ఓ మహిళా ఉద్యోగిని ఆ ప్రయాణికుడు అభ్యంతరకరంగా తాకారని విమాన సిబ్బంది ఆరోపించారు. కాగా, విమానంలో ఇరుకుగా ఉన్న కారణంగా ప్రమాదావశాత్తు ఇలా జరిగిందని కొందరు తోటి ప్రయాణికులు పేర్కొన్నారు.
దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొన్న ఆ ప్రయాణికుడు ఆ తర్వాత లిఖితపూర్వక క్షమాపణలు కూడా ఇచ్చారు. అయితే ఈ ఇబ్బందులు మళ్లీ తలెత్తకుండా ఆయనను విమానం నుంచి దించేశారు.
కాగా, ఈనెల 6వ తేదీన పారిస్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన విషయంపై ఎయిర్ ఇండియా అకౌంటబుల్ మేనేజర్‌కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విమానంలో ఓ ప్యాసింజర్.. టాయ్‍లెట్‍లో సిగరెట్ తాగుతూ పట్టుబట్టాడు. మద్యం తాగిన ఆ వ్యక్తి సిబ్బంది వారించినా వినలేదు. ఇక మరో ప్రయాణికుడు.. మహిళ టాయ్‍లెట్‍కు వెళ్లిన సమయంలో ఆమె సీటుపై ఉన్న దుప్పటిని కప్పుకొని అదే సీటులో నిద్రించాడని తెలుస్తోంది. వీటిపై ఎయిర్ ఇండియాను వివరణ అడిగింది డీజీసీఏ.
ఇటీవల పట్నా వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో మద్యం మత్తులో ఇద్దరు ప్యాసింజర్లు వాదులాడుకున్నారు. అయితే అలాందేమీ లేదని ఆ ఎయిర్ లైన్స్ చెప్పింది. అయితే, ఈ స్పష్టత ఇచ్చిన కొన్ని గంటలకే ఆ ఇద్దరు ప్రయాణికులను ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండిగో విమాన మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.