Parliament session: ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు; మాటల యుద్ధానికి అంతా సిద్ధం; మణిపూర్ హింసపై విపక్షాల వాయిదా తీర్మానం
Parliament monsoon session: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ సమావేశాల్లో తమ ఆధిపత్యం చూపడం కోసం అధికార పక్షం, విపక్షం తీవ్రంగా ప్రయత్నించనున్నాయి.
Parliament monsoon session: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. అధికార పక్షంతో కొత్తగా ఏర్పడిన విపక్ష కూటమి ‘ఇండియా’ తలపడనుంది. మణిపూర్ లో హింస నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడానికి సంబంధించిన వీడియో, టమాటా సహా పెరుగుతున్న కూరగాయలు, ఇతర నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్ష కూటమి భావిస్తోంది.
Adjournment motion notice: వాయిదా తీర్మానం
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఉభయ సభల్లోనూ మణిపూర్ హింసపై చర్చించాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం నోటీసును ఇచ్చాయి. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రమోద్ తివారీ, రంజిత్ రంజన్, సీపీఎం ఎంపీ ఎలమారం కరీం, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఈ తీర్మానాన్ని ఇచ్చారు. లోక్ సభలో సీపీఎం వినయ్ విశ్వం, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ, పలువురు ఇతర ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. మణిపూర్ లో పరిస్థితిపై వెంటనే చర్చించాలని వారు డిమాండ్ చేశారు. మణిపూర్ లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ప్రధాని మౌనంగా ఉండడాన్ని ప్రశ్నించారు. మణిపూర్ సరిహద్దు రాష్ట్రమని, అక్కడ పరిస్థితులు సజావుగా లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ మౌనం వీడి మణిపూర్ పరిస్థితిపై సభలో మాట్లాడాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.