PM Modi: ప్రధాన మంత్రి మోదీ కాళ్లు మొక్కిన పపువా న్యూ గినియా ప్రధాని: వీడియో-papua new guinea pm james marape touched prime minister narendra modi feet ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi: ప్రధాన మంత్రి మోదీ కాళ్లు మొక్కిన పపువా న్యూ గినియా ప్రధాని: వీడియో

PM Modi: ప్రధాన మంత్రి మోదీ కాళ్లు మొక్కిన పపువా న్యూ గినియా ప్రధాని: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
May 21, 2023 08:14 PM IST

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు మొక్కారు పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే. ఆ దేశంలో మోదీకి ఘన స్వాగతం లభించింది.

PM Modi: ప్రధాన మంత్రి మోదీ కాళ్లు మొక్కిన పపువా న్యూగినియా ప్రధాని: వీడియో (Photo: ANI)
PM Modi: ప్రధాన మంత్రి మోదీ కాళ్లు మొక్కిన పపువా న్యూగినియా ప్రధాని: వీడియో (Photo: ANI)

PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పపువా న్యూ గినియా(Papua New Guinea)లో అపూర్వ స్వాగతం లభించింది. ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐల్యాండ్స్ కార్పొరేషన్ (FIPIC) మూడో సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఆదివారం ఆ దేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ(Narendra Modi)కి ఆహ్వానం పలుకుతూ ఆయన కాళ్లు మొక్కారు పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే (James Marape). ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీనే. ఆ దేశంలో అడుగుపెట్టిన ఆయనకు ఘన స్వాగతం దక్కింది.

PM Modi: సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఏ దేశం నుంచి వచ్చి నాయకుడికైనా స్వాగత ఉత్సవాన్ని పపువా న్యూ గినియా నిర్వహించదు. అయితే ప్రధాని మోదీ కోసం ఆ సంప్రదాయాన్ని ఆ దేశం పక్కనపెట్టింది. అక్కడి స్థానిక సమయం రాత్రి 10 గంటల తర్వాత మోదీ.. పపువా న్యూ గినియాలో అడుగుపెట్టారు. మోదీకి స్వాగత ఉత్సవాన్ని ఆ దేశం నిర్వహించింది. ఈ సందర్భంగానే పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపే.. మోదీ కాళ్లకు మొక్కారు. ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు నరేంద్ర మోదీ.

19-గన్ సెల్యూట్, గార్డ్ ఆఫ్ హానర్, స్వాగత ఉత్సవంతో మోదీకి పపువా న్యూ గినియాలో ఘన స్వాగతం దక్కింది.

2021లో పపువా న్యూ గినియాకు కొవిడ్-19 వ్యాక్సిన్లను భారత్ భారీగా పంపింది. ఆ దేశం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ సమయంలో సాయం చేసింది. గ్లోబల్ వ్యాక్సిన్లు అందక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆ దేశానికి ఇండియా ఆపన్నహస్తం అందించింది.

జపాన్‍లో జీ7 సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ ఆ తర్వాత పపువా న్యూ గినియాకు వెళ్లారు. ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐల్యాండ్స్ కోఆపరేషన్ (FIPIC) సదస్సు సోమవారం జరగనుంది. ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే, గవర్నర్ జనరల్ బోబ్ దడేయీతో మోదీ భేటీ కానున్నారు. 14 పసిఫిక్ దేశాల నేతలు ఈ సదస్సులో పాల్గొంటారు.

మీరు నాకు ఇబ్బందులు తెచ్చారు: మోదీతో అమెరికా అధ్యక్షుడు బైడెన్

జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా బైడెన్ ఆసక్తికర కామెంట్లు చేశారని తెలుస్తోంది. మోదీ వల్ల తనకు ఓ సవాల్ ఎదురవుతోందని అన్నారు. జూన్‍లో వైట్ హౌస్‍లో ప్రధాని మోదీకి స్టేట్ డిన్నర్ ఇవ్వనున్నారు జో బైడెన్. అయితే ఆ డిన్నర్‌కు వస్తామని చాలా మంది తనను అడుగుతున్నారని, టికెట్లు మాత్రం అయిపోతున్నాయని బైడెన్ అన్నారు.

“మీరు నాకు ఓ సమస్యను తీసుకొస్తున్నారు. వాషింగ్టన్‍లో మీ కోసం వచ్చే నెల డిన్నర్ ఉంది. దేశం (అమెరికా)లోని చాలా ప్రాంతాల నుంచి ప్రతీ ఒక్కరు రావాలని అనుకుంటున్నారు. టికెట్లు ఏమో అయిపోతున్నాయి. నేను ఆట పట్టిస్తున్నానని అనుకుంటున్నారా? నా టీమ్‍ను అడగండి. నేను ఇంతకు ముందు పేర్లు వినని వారి దగ్గరి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మూవీ స్టార్ల నుంచి బంధువుల వరకు చాలా మంది నుంచి ఫోన్లు వస్తున్నాయి. మీరు చాలా పాపులర్” అని మోదీతో బైడెన్ అన్నారని రిపోర్టులు వచ్చాయి.

Whats_app_banner