OYO IPO : సెప్టెంబరు తరువాత ఓయో ఐపీఓ-oyo plans ipo after september may settle for lower valuation ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Oyo Ipo : సెప్టెంబరు తరువాత ఓయో ఐపీఓ

OYO IPO : సెప్టెంబరు తరువాత ఓయో ఐపీఓ

HT Telugu Desk HT Telugu
May 24, 2022 05:42 PM IST

ఓయో హోటల్స్ సంస్థ ఓయో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) తీసుకురానుంది.

ఓయో హౌజ్ బోట్
ఓయో హౌజ్ బోట్ (instagram/oyo)

న్యూఢిల్లీ, మే 24: ఆతిథ్య, ట్రావెల్-టెక్ సంస్థగా ఉన్న ఓయో ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్‌(ఐపీఓ) తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది. సెప్టెంబరు తరువాత ఐపీఓ తేవాలని యోచిస్తున్నట్టు చెబుతూ ఈమేరకు స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి లేఖ రాసింది. అప్‌డేట్ చేసిన కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్‌ను ఫైల్ చేసేందుకు అనుమతి కోరింది.

ఓయో కంపెనీ ఇనిషియల్ షేర్ సేల్ ద్వారా రూ. 8,430 కోట్ల మేర సమీకరించేందుకు వీలుగా ఇప్పటికే సెబీ వద్ద ప్రాథమిక డాక్యుమెంట్లు సమర్పించింది. గతంలో 11 బిలియన్ డాలర్లుగా వాల్యుయేషన్‌కు వెళ్లిన కంపెనీ.. ఇప్పుడు వాల్యుయేషన్‌ను 7-8 బిలియన్ డాలర్లకు సవరించేందుకు సమాయాత్తమవుతోందని ఈ పరిణామాలు తెలిసిన వారు సమాచారం అందించారు.

ఆర్థికంగా మెరుగైన పనితీరు కనబరిచేందుకు అవకాశం ఉన్నందున, అలాగే ప్రస్తుత అస్థిర పరిస్థితులు సద్దుమణిగే అవకాశం ఉన్నందున సెప్టెంబరు త్రైమాసికం అనంతరం ఐపీఓ తేవాలని ఓయో భావిస్తున్నట్టు వారు తెలిపారు.

సెప్టెంబరు 30, 2022, సెప్టెంబరు 30, 2021, సెప్టెంబరు 30, 2020తో అంతమయ్యే  త్రైమాసిక ఆర్థిక నివేదికలను సమర్పించేందుకు అనుమతి కోరుతూ ఓయో సంస్థను నిర్వహించే ఓరావెల్ స్టేస్ లిమిటెడ్ సెబీకి లేఖ రాసినట్టు అవగతమవుతోంది.

‘కొత్తగా స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీల షేరు ధరల అస్థిరత్వం ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. ఇలాంటి సెంటిమెంట్ల నడుమ బిజినెస్ పునరుద్ధరణ వాస్తవమేనన్న సంగతిని తెలియపరచడం మంచిది. ప్రస్తుతం బిజినెస్ పటిష్ఠంగా ఉంది. చాలా ఎక్కువ బుకింగ్స్ లభించే వాతావరణం ఉంది. ఇది సానుకూలతకు మొదటి సంకేతం. అందువల్ల ఓయో మరో త్రైమాసికం వరకు వేచి ఉండాలని భావిస్తోంది..’ అని కంపెనీ ప్రణాళికలు తెలిసిన ఓ వ్యక్తి వివరించారు.

అయితే దీనిపై ఓయో కామెంట్ చేసేందుకు నిరాకరించింది. కంపెనీ డీఆర్‌హెచ్‌పీ ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఓయో రూ. 1,744.7 కోట్ల మేర నష్టాలను చవిచూసింది. 

ప్రతిపాదిత ఐపీవో ప్రకారం కంపెనీ రూ. 7 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఇష్యూ చేయాలని, ఇందులో రూ. 1,430 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద ఇష్యూ చేయాలని భావించింది.

అయితే ఇప్పుుడు కేవలం రూ. 7 వేల కోట్ల మేర ప్రైమరీ ఇష్యుకు వెళ్లాలని, రూ. 1,430 కోట్ల మేర ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కంపోనెంట్ తొలగించాలని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. ఈమేరకు అనుమతి కోసం సెబీని సంప్రదించింది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు తమ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా ప్రజలకు అమ్మేయొచ్చు.

ఓయో ఓఎఫ్ఎస్ ద్వారా తన ఇన్వెస్టర్లు సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ 2 శాతం వాటాను విక్రయించి ఉండేది. అలాగే ఇతర పెట్టుబడిదారులు గ్రాబ్ హోల్డింగ్స్, హువాజు హోటెల్స్, సునీల్ ముంజల్ తన పెట్టుబడులను ఉపసంహరించుకుని ఉండేవారు. 

మార్కెట్లలో లిస్టయ్యేసరికి ఓయో మరింత సహేతుకమైన వాల్యుయేషన్‌కు సవరించుకునే వీలుంటుంది. ఇటీవలి కాలంలో మార్కెట్లలో అనిశ్చితి, అస్థిరత వాల్యుయేషన్ సవరణకు దారితీస్తోంది. గతంలో ఉన్న 11 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను 7-8 బిలియన్ డాలర్లకు సవరించడం ఇలాంటి మార్కెట్ పరిస్థితుల్లో సహేతుకమవుతుంది. 

గత అక్టోబరు 2021లో ఓయో కంపెనీ సెబీ వద్ద డీఆర్‌హెచ్‌పీ ఫైల్ చేసినప్పుడు మార్కెట్లు జోష్‌లో ఉన్నాయి. కంపెనీల వాల్యుయేషన్లు గరిష్ఠంగా ఉండేవి. ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ పొందేవి. ఆ సమయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా ఉండేవారు. కానీ కొద్దికాలంగా నికర అమ్మకందారులుగా ఉన్నారు.

కానీ ప్రస్తుతం మార్కెట్లో ఆ సీన్ లేదు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితులు, ద్రవ్యోల్భణ పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.

2021 ఆగస్టులో ఓయో 5 మిలియన్ డాలర్లను మైక్రోసాఫ్ట్ నుంచి సమీకరించింది. ఆ సమయంలో ఓయో మార్కెట్ వాల్యుయేషన్ 9.6 బిలియన్లుగా ఉంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం