UPA name change: బెంగళూరులో ప్రస్తుతం జరుగుతున్న ప్రతిపక్షాల సమావేశం (Opposition meet) లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. బీజేపీ ని ఎదుర్కోవడం కోసం అమలు చేయాల్సిన వ్యూహాలతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
కాంగ్రెస్ నాయకత్వంలో గతంలో ఏర్పడిన యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (United Progressive Alliance UPA) కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేస్తున్న కూటమి పేరును అదే యూపీఏ గా కొనసాగిస్తారా? లేక కొత్త పేరుతో కూటమిని ఏర్పాటు చేస్తారా? అన్నది ఉత్కంఠభరితంగా మారింది. బెంగళూరు సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం నాలుగు పేర్లు ప్రతిపాదనలో ఉన్నాయి. ఆ పేర్లపై విపక్ష నేతల సమావేశంలో చర్చిస్తారు. అనంతరం, తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీకి అప్పగిస్తారు. మంగళవారం విపక్ష నేతల భేటీ అనంతరం మీడియా సమావేశంలో విపక్ష కూటమి పేరును వెల్లడించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో 2004 లో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ (United Progressive Alliance UPA) ఏర్పడింది. అప్పుడు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కన్నా ఏడు సీట్లు మాత్రమే అదనంగా వచ్చాయి. దాంతో, బీజేపీయేతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంతో యూపీఏ ను ఏర్పాటు చేశారు. యూపీఏ ఏర్పాటులో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీతో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సూర్జిత్ కీలక పాత్ర పోషించారు. ఆర్జేడీ, టీఆర్ఎస్, డీఎంకే, ఎంఐఎం, పీడీపీ, ఎన్సీపీ, జేఎంఎం తదితర 14 పార్టీలతో యూపీఏ ఏర్పడింది. వామపక్షాలు బయటి నుంచి మద్దతిచ్చాయి. ప్రభుత్వ విధానాల రూపకల్పన కోసం కామన్ మినిమం ప్రొగ్రామ్ ను రూపొందించారు. మొదట ఈ కూటమి పేరును యునైటెడ్ సెక్యులర్ అలయన్స్ లేదా ప్రొగ్రెసివ్ సెక్యులర్ అలయన్స్ అనే పేర్లలో ఒకపేరును పెట్టాలనుకున్నారు. కానీ, నాడు డీఎంకే అధినేత గా ఉన్న కరుణానిధి యూపీఏ పేరును ప్రతిపాదించారు. దాన్ని భాగస్వామ్య పార్టీలన్నీ అంగీకరించాయి.