Inspiration: ఒకప్పుడు రిక్షాపుల్లర్.. ఇప్పుడు స్టార్టప్ ఓనర్.. ఐఐటీలు, ఐఐఎంలకు ఉద్యోగాలిస్తున్నాడు-once rickshaw puller vegetable vendor now creates startup hires itts iims ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Inspiration: ఒకప్పుడు రిక్షాపుల్లర్.. ఇప్పుడు స్టార్టప్ ఓనర్.. ఐఐటీలు, ఐఐఎంలకు ఉద్యోగాలిస్తున్నాడు

Inspiration: ఒకప్పుడు రిక్షాపుల్లర్.. ఇప్పుడు స్టార్టప్ ఓనర్.. ఐఐటీలు, ఐఐఎంలకు ఉద్యోగాలిస్తున్నాడు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 06, 2023 12:40 PM IST

Inspiration: ఒకప్పుడు రిక్షా నడిపిన వ్యక్తి.. ఇప్పుడు స్టార్టప్ స్థాపించి ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇస్తున్నారు. కొత్త ఆలోచనతో స్థాపించిన కంపెనీ సక్సెస్ అయింది.

తన టీమ్‍తో దిల్‍ఖుష్ కుమార్ (Photo: Instagram/dilkhuskumr)
తన టీమ్‍తో దిల్‍ఖుష్ కుమార్ (Photo: Instagram/dilkhuskumr)

Rickshaw Puller to Start-up owner: అంకిత భావంతో కష్టపడితే, క్లిష్ట సమయాల్లోనూ నిరాశ చెందకుండా లక్ష్యం దిశగా ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం దక్కుతుందని కొందరు నిరూపిస్తుంటారు. తీవ్రమైన కష్టాలను ఎదుర్కొని తమ కృషితో విజేతగా నిలుస్తుంటారు. అలాంటి స్టోరీనే ఇది. “ఒప్పుడు రిక్షా నడిపారు.. కూరగాయలు అమ్మారు.. ఒకానొ సమయంలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి కూడా ఎంపిక కాలేదు” ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న ఓ వ్యక్తి ఏకంగా స్టార్టప్ స్థాపించారు. ఇప్పుడు తన కంపెనీలో ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇస్తున్నారు. బిహార్‌(Bihar)లోని చిన్న గ్రామానికి చెందిన దిల్‍ఖుష్ కుమార్ (Dilkhush Kumar) ఈ స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించారు.

కొత్త ఐడియాతో..

బిహార్‌లోని సహస్ర జిల్లాకు చెందిన దిల్‍ఖుష్ 12వ తరగతి వరకు చదివారు. ఏదైనా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. దీంతో బిహార్‌లో ట్యాక్సీ సర్వీస్‍లను అందించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో రోడ్‍బెజ్ (Rodbez) అనే స్టార్టప్ స్థాపించారు. అయితే ఇది ఉబెర్, ఓలా లాంటి ఇతర ట్యాక్సీ సర్వీస్ ప్రొవైడర్లలా కాదు. ఇదో డేటా బేస్ కంపెనీ. కస్టమర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు అనుసంధానంగా పని చేసి.. 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేసే వారికి వాహనాలను అందిస్తుంది.

తన జీవిత ప్రయాణాన్ని జీఎన్‍టీ డిజిటల్‍తో ఇటీవల పంచుకున్నారు దిల్‍ఖుష్ కుమార్. ఐఐటీ గౌహతి లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివిన గ్రాడ్యుయేట్లను కంపెనీలో నియమించుకున్నట్టు తెలిపారు. ఐఐఎంలను పార్ట్ టైమ్ విధానంలో చేర్చుకున్నట్టు వెల్లడించారు.

రిక్షా నడిపా..

తన ప్రస్థానం గురించి చెబుతున్న క్రమంలో గతాన్ని గుర్తుచేసుకొని దిల్‍ఖుష్ భావోద్వేగానికి లోనయ్యారు. ఢిల్లీలో తాను కొన్ని రోజులు రిక్షా నడిపానని చెప్పారు. పట్నాలోని వీధుల్లో కూరగాయలు విక్రయించానని తెలిపారు.

యాపిల్ లోగో గుర్తుపట్టలేకపోయా..

సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కోసం ఇంటర్వూకు వెళ్లగా.. తనను తిస్కరించారని దిల్‍ఖుష్ కుమార్ తెలిపారు. యాపిల్ లోగో గుర్తించాలని తనను ఇంటర్వ్యూలో అడిగారని, కానీ తాను గుర్తు పట్టలేకపోయానని అన్నారు. తాను ఐఫోన్ చూడడం అదే తొలిసారి కావటంతో లోగో గుర్తుపట్టలేదని చెప్పారు. అయితే, కుటుంబాన్ని పోషించాలి కాబట్టి తాను తన ప్రయత్నాలను ఎప్పుడూ విరమించుకోలేదని చెప్పారు.

సెకండ్ హ్యాండ్ ‘నానో’తో ప్రారంభం

బస్ డ్రైవర్ అయిన తన తండ్రి దగ్గర దిల్‍ఖుష్ కుమార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల 12వ తరగతి వరకు మాత్రమే చదవగలిగారు. అప్పటి నుంచే డ్రైవింగ్‍తో పాటు పలు పనులు చేశారు.

కాగా, తన రోడ్‍బెజ్ సంస్థను సెకండ్ హ్యాండ్ టాటా నానో కారుతో దిల్‍ఖుష్ మొదలుపెట్టారు. 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణాల కోసం.. కస్టమర్లను, ట్యాక్సీ డ్రైవర్లను అనుసంధానం చేసే ఆ ఆలోచన చాలా మందికి నచ్చింది. 7 నెలల్లోనే దిల్‍ఖుష్, అతడి టీమ్ ఏకంగా రూ.4కోట్ల నిధులను సమీకరించింది. ప్రస్తుతం ఈ కంపెనీ పట్నా నుంచి బిహార్‌లోని గ్రామాలకు సర్వీసులను అందిస్తోంది. రెండో దశలో సిటీ నుంచి సిటీకి సర్వీసులను కనెక్ట్ చేయనుంది. బిహార్‌లోని ప్రతీ గ్రామానికి ట్యాక్సీ సర్వీసులను చేరువ చేయాలన్నదే తమ విజన్ అని దిల్‍ఖుష్ చెప్పారు. భవిష్యత్తులో బిహార్ వెలుపల కూడా సర్వీసులను విస్తరిస్తామని అన్నారు.

Whats_app_banner

టాపిక్