ఎల్పీజీ సబ్సీడీ ఇవ్వడం లేదు
వంటగ్యాస్ సబ్సీడీని నిలిపివేసి దాదాపు రెండు సంవత్సరాలు అయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఉజ్వల పథకం కింద ఎల్పీజీ కనెక్షన్లు పొందిన వారికి మాత్రమే సిలిండర్‌పై రూ. 200 సబ్సడీ లభిస్తోందని స్పష్టం చేసింది.
జూన్ 2020 నుంచి సాధారణ వినియోగదారులకు వంటగ్యాస్‌పై సబ్సీడీని నిలిపివేసినట్లు గురువారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వారంతా మార్కెట్ ధరనే చెల్లిస్తున్నట్లు తెలిపింది. పేద మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రం సిలిండర్‌పై రూ. 200 సబ్సీడీ కొనసాగుతోందని వివరించింది. ఉజ్వల పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి.
కోవిడ్ ప్రారంభం నుంచి..
దేశంలో కోవిడ్ ఉధృతి ప్రారంభమైన జూన్ 2020 నుంచి వంటగ్యాస్(ఎల్పీజీ)పై సబ్సీడీని నిలిపివేశామని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ గురువారం తెలిపారు. పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై లీటర్‌కు రూ. 6 ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం సిలిండర్‌కు రూ. 200 చొప్పున సంవత్సరానికి 12 సిలిండర్లకు సబ్సీడీ లభిస్తుందని నిర్మల స్పష్టం చేశారు. దీనివల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి రూ. 6100 కోట్ల భారం పడుతోందన్నారు.
వెయ్యి దాటిన సిలిండర్ ధర
ప్రస్తుతం 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1003గా ఉంది. తెలంగాణ సహా మిగతా చాలా రాష్ట్రాల్లో ఇళ్లల్లో ఉపయోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలండర్ ధర వెయ్యి దాటింది. ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం అందులో రూ. 200 సబ్సీడీ లభిస్తుంది.
2010లోనే పెట్రోల్‌పై..
పెట్రోల్‌పై ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీని జూన్ 2010లో నాటి ప్రభుత్వం తొలగించింది. డీజిల్‌పై సబ్సీడీని 2014లో తొలగించారు. ఆ తరువాత కొన్నేళ్లకు కిరోసిన్‌పై సబ్సీడీని కూడా పక్కనబెట్టారు. ఇప్పుడు, నిత్యావసరమైన ఎల్పీజీపై కూడా సబ్సీడీని ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో 9 కోట్ల ఉజ్వల కనెక్షన్లు సహా మొత్తం 30.5 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణ గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర సంవత్సర కాలంలో దాదాపు రూ. 200 పెరిగింది. ఇది మధ్యతరగతి వినియోగదారుడికి పెను భారమే.
టాపిక్