NIRF Rankings 2022: ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్‌దే అగ్రస్థానం
NIRF Rankings 2022: విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించిన ఎన్ఐఆర్ఎఫ్- 2022 ర్యాంకింగ్స్‌లో ఐఐటీ మద్రాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది.
న్యూఢిల్లీ, జూలై 15: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత విద్యా సంస్థల ర్యాంకింగ్స్ 2022 (NIRF Rankings 2022) నివేదికను విడుదల చేశారు. అత్యుత్తమ విద్యా సంస్థల మొదటి పది జాబితాలో ఏడు ఐఐటీలు ఉన్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-న్యూఢిల్లీ, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంతో పాటు ఐఐటీలు టాప్-10లో నిలిచాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 40,000 నుండి 50,000 ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయని, అయితే, అన్ని సంస్థలు అక్రిడిటేషన్, ర్యాంకింగ్ అనే రెండు ఫ్రేమ్‌వర్క్‌ల క్రిందకు రావాలని కోరారు.
ఓవరాల్, యూనివర్సిటీ, కాలేజీలు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, లా, మెడికల్, ఆర్కిటెక్చర్, డెంటల్, రీసెర్చ్ కేటగిరీలకు సంబంధించి టాప్ ఇన్‌స్టిట్యూట్‌ల ర్యాంకులు వెల్లడించారు. బోధన, అభ్యాసం, వనరులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్ ఫలితం, ఔట్ రీచ్, చేరిక, తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు.
యూనివర్శిటీ కేటగిరీ కింద ఐఐఎస్‌సీ అగ్రస్థానంలో ఉండగా, జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా, పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాలేజీ కేటగిరీలో మిరాండా హౌస్ అగ్రస్థానంలో ఉంది. హిందూ కళాశాల రెండో ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల మూడో స్థానంలో నిలిచింది.
ఫార్మసీ సంస్థలలో జామియా హమ్‌దర్ద్ టాప్ ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-హైదరాబాద్ , పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఎయిమ్స్- ఢిల్లీ ఉత్తమ వైద్య కళాశాలగా ర్యాంక్‌ను పొందగా, పీజీఐఎంఈఆర్- చండీగఢ్, సీఎంసీ-వెల్లూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఐఐఎం-అహ్మదాబాద్ దేశంలో అత్యుత్తమ నిర్వహణ సంస్థగా నిలిచింది. ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-కలకత్తా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
టాపిక్