Road Accident: కారు - బస్సు ఢీ.. 10 మంది మృతి.. బస్సు డ్యాష్ క్యామ్‍లో రికార్డయిన వీడియో-mysuru road accident 10 died in collision between car bus ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Road Accident: కారు - బస్సు ఢీ.. 10 మంది మృతి.. బస్సు డ్యాష్ క్యామ్‍లో రికార్డయిన వీడియో

Road Accident: కారు - బస్సు ఢీ.. 10 మంది మృతి.. బస్సు డ్యాష్ క్యామ్‍లో రికార్డయిన వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
May 29, 2023 08:52 PM IST

Mysuru Road Accident: మైసూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. ప్రమాదం సంభవించిన దృశ్యాలు బస్సు డ్యాష్‍క్యామ్‍లో రికార్డ్ అయ్యాయి.

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు (ANI)

Mysuru Road Accident: కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు, ప్రైవేటు బస్సు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది చనిపోయారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమకుడలు - నరసిపుర మధ్య కుర్బూర్ గ్రామం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలివే..

ప్రమాదం జరిగిందిలా..

కుర్బూర్ సమీపంలో 766వ జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు.. ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. బస్సు ముందు భాగం కూడా తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులోని ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. మృతులది కర్ణాటకలోని బళ్లారి అని తెలుస్తోంది. కారు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

చాముండి హిల్స్, ఎంఎం హిల్స్, బీఆర్ హిల్స్, మైసూరు జూ లాంటి ప్రాంతాలను చూసి ఆ కుటుంబం కారులో మైసూరు రైల్వే స్టేషన్‍కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగనట్టు తెలుస్తోంది. కారులో డ్రైవర్ సహా మొత్తంగా 13 మంది ఉన్నారు. మైసూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్బూర్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

మలుపు వద్ద కారు వేగంగా దూసుకొస్తున్న దృశ్యాలు బస్సు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డు అయ్యాయి . కారు ఒక్కసారిగా వచ్చి బస్సును ఢీకొన్నట్టు ఇందులో కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్‍గా మారింది.

ఈ రోడ్డు ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.2లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా మైసూరు సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు చెరో రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. “కర్ణాటకలోని మైసూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధిస్తోంది. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మృతుల కుటుంబాలకు చెరో రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నా. గాయపడిన వారికి చెరో రూ.50వేల ఇస్తాం” అని ప్రధాని మోదీ చెప్పినట్టు ప్రధాన మంత్రి కార్యాలయం ట్వీట్లు చేసింది.

అసోంలోని గువహటిలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.

IPL_Entry_Point