వీళ్లు ‘రైట్ బ్రదర్స్’ కు తక్కువేం కాదు; మారుతి వేగన్ ఆర్ కారును ఏకంగా హెలీకాప్టర్ గా మార్చేశారు..
WagonR modified into a helicopter: ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు పాత మారుతి వేగన్ ఆర్ కారును ఏకంగా హెలీకాప్టర్ గా తీర్చిదిద్దారు. పెళ్లిళ్లలో వధూవరులను తీసుకువెళ్లడానికి ఆ చాపర్ ను ఉపయోగించి డబ్బు సంపాదంచాలని అనుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ, పోలీసులు వారి ప్లాన్ ను భగ్నం చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని అంబేడ్కర్ నగర్ కు చెందిన ఇద్దరు సోదరులు మారుతి వ్యాగన్ ఆర్ కారును హెలికాప్టర్ గా మార్చే ప్రయత్నం ప్రారంభించారు. కానీ యూపీ పోలీసులు వారి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అర్ధాంతరంగా ముగించారు. పోలీసులు ఆ ‘చాపర్ కారు’ను సీజ్ చేయడంతో పాటు అన్నదమ్ములిద్దరికీ రూ.2 వేల చలానా విధించారు. అయితే,ఆ బ్రదర్స్ తయారు చేసిన హెలికాప్టర్ వెల్డెడ్ టెయిల్, రోటర్ తో మోడిఫైడ్ వ్యాగన్ఆర్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వైరల్ గా మారింది.
టెయిల్, రోటర్ బిగించారు..
ఈ సోదరులిద్దరూ ముందుగా, ఒక పాత మారుతి వ్యాగన్ ఆర్ కారు ను కొనుగోలు చేశారు. ఈ కారును హెలీకాప్టర్ గా మార్చి, వివాహాల్లో వధూవరులను తీసుకువెళ్లడానికి ఆ చాపర్ ను ఉపయోగించి డబ్బు సంపాదంచాలని అనుకున్నారు. వెంటనే, పని ప్రారంభించారు. కారు పై భాగంలో స్క్రాప్ మెటల్ తో తయారు చేసిన రోటర్ ను, వెనుక భాగంలో టెయిల్ ను వెల్డింగ్ చేసి బిగించారు. టెయిల్ రోటర్ ను కారు యొక్క బూట్ లోకి వెల్డంగ్ చేశారు. ఇంజన్ లోనూ స్వల్ప మార్పులు చేశారు. కారులో క్యాబిన్ ను ఏర్పాటు చేశారు. వీటన్నింటి కోసం దాదాపు రూ. 2.5 లక్షలను ఖర్చు చేశారు. పెళ్లిళ్ల సీజన్ లో వధూవరులను తీసుకెళ్లడానికి ఈ మోడిఫైడ్ మారుతి వ్యాగన్ఆర్ హెలికాప్టర్ ను ఉపయోగించాలని ఈశ్వర్ దీన్, అతని సోదరుడు ప్లాన్ చేశారు.
పోలీసుల దృష్టిలో పడి..
వీరిద్దరూ ఆ వాహనానికి రంగులు వేసేందుకు అక్బర్ పూర్ తీసుకు వెళ్తుండగా.. వింతగా ఉన్న ఈ కారుపై స్థానిక పోలీసుల దృష్టి పడింది. వారు దాన్ని సీజ్ చేసి, స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఆ కారు వాహన చట్టం నిబంధనలకు లోబడి లేదని వారికి రూ. 2 వేల జరిమానా విధించారు. పెళ్లిళ్ల సీజన్లలో బుకింగ్ కోసం ఈ కారును మార్చానని, తద్వారా తమ కుటుంబం కొంత అదనపు డబ్బు సంపాదించగలుగుతుందని ఈశ్వర్ తెలిపారు. జరిమానా చెల్లించి, కారును పోలీసుల నుంచి ఆ సోదరులు విడిపించగలిగారు కానీ, కారుకు చేసిన మార్పులను వెంటనే తొలగించాలని పోలీసులు ఆదేశించడంతో, వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి.
చట్ట వ్యతిరేకం
మోటారు వాహనాల చట్టంలో నిర్దేశించిన విధంగా భారతీయ రహదారులకు భద్రతా ప్రమాణాలను అందుకోనందున ఆ వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యాగన్ ఆర్ ను సవరించడానికి సోదరులకు సరైన అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పొరుగు రాష్ట్రమైన బీహార్ లో కూడా ఇలాంటి మోడిఫైడ్ కార్లు నడుస్తున్నందున తన వాహనాలను అనుమతించాలని ఈశ్వర్ దీన్ విజ్ఞప్తి చేశారు. కానీ పోలీసులు అతని విజ్ఞప్తిని పట్టించుకోలేదు. మార్పులకు ఆర్టీవో విభాగం నుంచి అనుమతి అవసరమని, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద వాహనాన్ని సీజ్ చేశామని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ పాండే తెలిపారు. స్థానిక ఆర్టీఓ అనుమతి లేకుండా భారతదేశంలో కారు మోడిఫికేషన్ అనుమతించరు. స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకుండా వాహనంలో చేసిన మార్పులు మోటారు వాహనాల చట్టం ప్రకారం చట్టవిరుద్ధమైన చర్యగా పరిగణిస్తారు.