Maharashtra political crisis : కోవిడ్ బారిన పడ్డ మహారాష్ట్ర గవర్నర్
ఏక్‌నాథ్ షిండే తన మద్దతుదారులతో సభలో బలపరీక్షకు సిద్ధమవుతుండగా.. మహారాష్ట్ర గవర్నర్ కోవిడ్ బారిన పడ్డారు.
ముంబై, జూన్ 22: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. చికిత్స నిమిత్తం ఆయన బుధవారం ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేరారు.
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఏర్పడ్డాక తిరుగుబాటుదారుడైన శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే 40 మంది శాసనసభ్యుల మద్దతు ఉందని పేర్కొంటూ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కలవాలని భావించారు.
తిరుగుబాటు నేత, మహారాష్ట్ర కేబినెట్ మంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ముప్పై మూడు మంది శివసేన సభ్యులు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీ పాలిత అస్సాంలోని గౌహతిలో గల ఒక విలాసవంతమైన హోటల్‌కు చేరుకున్నారు. శివసేనలో తిరుగుబాటు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
శివసేన ఎమ్మెల్యేలు ఇప్పుడు గౌహతి నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో బస చేశారు. ‘మొత్తం 40 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు. మేం బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వాన్ని ముందుకు తీసుకెళతాం..’ అని గౌహతి చేరుకున్న తర్వాత షిండే అన్నారు.
గౌహతి విమానాశ్రయంలో శివసేన ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యే సుశాంత బోర్గోహైన్, బీజేపీ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ స్వాగతం పలికారు.
‘నేను వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చాను. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారో లెక్కించలేదు. వ్యక్తిగత సంబంధాల కోసం ఇక్కడికి వచ్చాను. వారు ఏ కార్యక్రమం గురించి వెల్లడించలేదు’ అని బోర్గోహైన్ చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్