Political Analysis: బీజేపీ వ్యూహాలతో కాంగ్రెస్‌ విలవిల-lessons to be learned by the parties after the latest election results in gujarat himachal and delhi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Political Analysis: బీజేపీ వ్యూహాలతో కాంగ్రెస్‌ విలవిల

Political Analysis: బీజేపీ వ్యూహాలతో కాంగ్రెస్‌ విలవిల

HT Telugu Desk HT Telugu
Dec 15, 2022 02:03 PM IST

‘‘తాజా ఎన్నికల ఫలితాలు స్థూలంగా గమనిస్తే అన్ని పార్టీలకు విజయం లభించిందనేలా ఉన్నాయి. నిజానికి ఈ మూడు ప్రధాన పార్టీలకు ఈ ఫలితాల్లో నేర్చుకోదగ్గ గుణపాఠాలున్నాయి..’’ - పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ పొలిటికల్ అనలిస్ట్ ఐ.వి.మురళీ కృష్ణ శర్మ విశ్లేషణ

ఎన్నికల ప్రచారంలో మోదీ
ఎన్నికల ప్రచారంలో మోదీ

శీతాకాలం చలిగాలుల్లో ఉత్తరాది ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచాయి. గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు విభిన్నంగా వచ్చాయి. గుజరాత్‌లో బీజేపీ అఖండ విజయం సాధించగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ మెజార్టీ సాధించింది. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌కు విజయం దక్కింది. ఈ ఫలితాలు స్థూలంగా గమనిస్తే అన్ని పార్టీలకు విజయం లభించిందనేలా ఉన్నాయి. నిజానికి ఈ మూడు ప్రధాన పార్టీలకు ఈ ఫలితాల్లో నేర్చుకోదగ్గ గుణపాఠాలున్నాయి.

ఈ ఫలితాలను లోతుగా గమనిస్తే భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు కొంతమేర విజయవంతం అవుతున్నాయని చెప్పవచ్చు. గుజరాత్‌లో బీజేపీ 27 సంవత్సరాలుగా తన విజయపరంపరను కొనసాగిస్తూ ఈ ఎన్నికల్లో 156 స్థానాలను గెలిచి చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్‌ 17 స్థానాలు మాత్రమే గెలిచి చతికిలపడింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో సంప్రదాయంగా కొనసాగుతున్న ప్రభుత్వ మార్పును ఈ సారి తిరగరాస్తామని బీజేపీ ఎన్ని ప్రగాల్భాలు పలికినా కాంగ్రెస్‌ 40 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. బీజేపీ గట్టి పోటి ఇచ్చి 25 స్థానాలు సాధించింది.

ఇక ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ 134 స్థానాలు సాధించి నగరపాలికలో 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టింది. బీజేపీ 104 స్థానాలు సాధించింది. ఈ ఫలితాలను విశ్లేషిస్తే బీజేపీ హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారం చేపట్టకపోయినా గట్టి పోటీ ఇచ్చింది. ఈ మూడు చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య ప్రధాన పోటీ జరిగింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఎన్నికల పోరు తీరును పరిశీలిస్తే ఎంతో చరిత్ర గలిగిన కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలు తేటతెల్లమవుతున్నాయి.

విజయాన్నీ ఆస్వాదించ లేకపోయిన కాంగ్రెస్‌

ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. అక్కడి గెలుపు జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ముఖ్యంగా నరేంద్ర మోడీకి ఎంతో కీలకం. ఒకవేళ గుజరాత్‌లో పరాజయం పొందితే వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో గడ్డుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేసిన బీజేపీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులను కూడదీసుకొని ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశాలు ఇవ్వకుండా పోరాడింది. గుజరాత్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ నరేంద్రమోడీ నేతృత్వంలో విజయ సంబరాలను పెద్దఎత్తున నిర్వహించింది. కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సమాయత్తమయ్యేలా ఈ కార్యక్రమంలో మోడీ ఉత్తేజభరితమైన ప్రసంగం చేశారు.

ఇందుకు భిన్నంగా మరో రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లో అందలమెక్కిన కాంగ్రెస్‌ కార్యాలయంలో నిశబ్ధ వాతావరణం నెలకొంది. ఒకచోట పరాజయం పొందినా బీజేపీ గెలుపు సంబరాలు నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపితే, కాంగ్రెస్‌ మాత్రం సాదాసీదాగానే ఉంది. గెలుపును కూడా కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో ఆస్వాదించలేపోయంది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేలా రాజకీయ పార్టీలకు ఆర్భాటం, ప్రచారం ఎంతో మూలమనే ప్రాథమిక అంశాన్ని కూడా కాంగ్రెస్‌ విస్మరించింది. ప్రతి ఎన్నికను బీజేపీ సవాలుగా తీసుకుంటుంది. పార్టీ అగ్ర నేతల నుండి సామాన్య కార్యకర్తల వరకు ఇందులో భాగస్వాములవుతారు. గుజరాత్‌ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా, కాంగ్రెస్‌ మాత్రం వారి అగ్ర నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’లో నిమగ్నమయింది. ఎన్నికల కోసం ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని ఆ పార్టీ కల్పించలేకపోయింది.

కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా రెండు పార్టీల మధ్య ఎంతో వ్యత్యాసం కన్పిస్తుంది. సాధారణ ఎన్నికలకు దాదాపు సంవత్సరం వ్యవధి మాత్రమే ఉన్న సమయంలో బీజేపీ 2021 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని మంత్రి వర్గాన్ని రాత్రికి రాత్రే దించివేసే సాహస నిర్ణయాన్ని తీసుకొంది. అంతేకాక ఎన్నికల్లో 44 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లను కూడా నిరాకరించింది. కాంగ్రెస్‌లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దాదాపు అసాధ్యం. ఇటీవల కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ విషయంలో పార్టీ అధిష్టానం ఎంత తర్జన భర్జన పడిరదో బహిరంగ రహస్యమే.

గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ తన సైద్ధాంతికతకు భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయదు. గతంలో పార్టీని తీవ్రంగా విమర్శించిన హార్థిక్‌ పటేల్‌, అల్పేష్‌ ఠాకూర్‌లను పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇచ్చి గెలిపించుకుంది. అదే కాంగ్రెస్‌ గెలుపు గుర్రాలు పార్టీని వీడుతున్నా వారిని ఆపడానికి ప్రయత్నించిన దాఖలాలు కనిపించవు. బీజేపీలో చురుకుగా ఎదుగుతున్న నేతలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ హిందుత్వ వాదంతో ఎదిగిన తరహాలో గుజరాత్‌లో రాబోయే తరానికి హర్ష సంఫ్వీు వంటి యువనేతలను బీజేపీ ప్రోత్సహిస్తుంది. కాంగ్రెస్‌లో మూడు మార్లు ఎంపీగా గెలిచి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పోటీ చేసిన శశిథరూర్‌పై తిరుగుబాటు కార్యకర్తగా ముద్ర వేసి, ఆయన సొంత రాష్ట్రం కేరళలోనే ఆయనకు ఆదరణ లేకుండా చేశారు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌ పార్టీలో ప్రతిభ కలిగిన నాయకులకు ప్రోత్సాహం కరువే అని చెప్పవచ్చు.

ప్రచారానికి అధిక ప్రాధాన్యత

బీజేపీ మీడియా ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సోషల్‌ మీడియా మొదలుకొని అన్ని మీడియా రంగాలను సద్వినియోగం చేసుకుంటుంది. మీడియా వినియోగంలో కాంగ్రెస్‌ గతంలో కంటే పుంజుకున్నా బీజేపీతో పోటీపడ లేకపోతుంది. పోల్‌ మేనేజ్‌మెంట్‌లో కూడా రెండు పార్టీల మధ్య ఎంతో తేడా ఉంది. బీజేపీ క్షేత్రస్థాయిలో వ్యూహాత్మకంగా కార్యకర్తలను మోహరించింది. ప్రతి 30 ఓటర్లకు ఐదుగురు సభ్యులు గల బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించింది. దీంతో ఓటర్లకు పార్టీ కార్యకర్తలతో, పార్టీతో సాన్నిహిత్యం కలిగే వాతావరణం ఏర్పడింది.

బీజేపీతో పోలిస్తే పోలింగ్‌ బూత్ స్థాయిలో కాంగ్రెస్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌ తేలిపోయింది. ఇటీవల యూపీలోని రాంపూర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపును పరిగణలోకి తీసుకుంటే గెలుపు అసాధ్యం అనే భావన ఆ పార్టీ దరి చేరనీయదని గమనించవచ్చు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ బలమైన నేత అజంఖాన్‌కు కంచుకోటగా ఉన్న రాంపూర్‌ నియోజకవర్గంలో బీజేపీ విజయాన్ని ఎవరూ ఊహించలేరు. అయినా ఆ పార్టీ విజయం సాధించింది. 2017 గుజరాత్‌ ఎన్నికల్లో అతికష్టం మీద గెలిచిన బీజేపీ వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకొని లోపాలను సరిదిద్ధుకుంది. కాంగ్రెస్‌ మాత్రం 2017లో 77 స్థానాలు సాధించినా ఈ సారి 60 సీట్లు కోల్పోయి 17 స్థానాలకే పరిమితమవడం ఆ పార్టీ నిర్వహణా వైఫల్యాన్ని, అంతకు మించి వారి మాససిక స్థితిని తెలియజేస్తుంది.

బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఆర్థిక వనరులు తక్కువని, రాజకీయ నిధులపై బీజేపీ గుత్తాధిపత్యం కొనసాగుతందనే వాదనుంది. ఇందులో నిజమున్నా వనరుల వినియోగంలో రెండు పార్టీల మధ్య వ్యత్యాసాలున్నాయి. కాంగ్రెస్‌ దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా పార్టీ పటిష్టతకు వనరులను వినియోగించడంలో పూర్తిగా వెనుకబడే ఉంది. వ్యక్తిగతంగా పార్టీ నాయకులు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధించినా పార్టీ మాత్రం నిధులలేమితో కొట్టుమిట్టాడుతుంది. ఇక ఎన్నికల వ్యూహంలో భాగంగా అన్నింటికంటే ప్రధానమైంది బీజేపీ అగ్ర నాయకులంతా పార్టీ ప్రచారంలో భాగస్వాములయ్యారు. ప్రతి కార్యకర్త ఇరవై నాలుగు గంటలు పార్టీ గెలుపునకు కృషి చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు ఒకవైపు ఎన్నికలు మరోవైపు పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ మధ్య నలిగిపోయారు. స్వల్పంగా రెండు రోజుల గుజరాత్‌ పర్యటనకు వచ్చిన రాహుల్‌ బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను, స్థానిక గుజరాత్‌ ప్రజల ఇక్కట్లను ప్రస్తావించకుండా తన ‘భారత్‌ జోడో’ యాత్ర గురించే మాట్లాడటం పార్టీ శ్రేణుల్ని కూడా విస్మయపరిచింది. జోడో యాత్ర ఎన్నికల్లో విజయం కోసం ఉద్ధేశించింది కాదనే ప్రచారం పార్టీకి నష్టం చేకూరింది. ఎన్నికల్లో పోటీ చేయడం, విజయం సాధించడం ప్రజాస్వామ్యంలో ఒక భాగమే. కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం ఈ విషయాన్ని విస్మరించింది. మహాత్మా గాంధీ స్వస్థలం పోర్‌బందర్‌ నుండి ఈ యాత్రను రాహుల్‌ ఎందుకు ప్రారంభించలేదనే ప్రశ్న ఇప్పుడు అందరిలో మెదులుతుంది. పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేని రాష్ట్రాలలో పాదయాత్ర చేపడితే ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాకపోతే రాహుల్‌ గాంధీపై అపవాదు వస్తుందని ఆ పార్టీ పలాయనం చిత్తగించిందా అనే ప్రశ్న వస్తుంది.

పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రంలో పాదయాత్ర చేపడితే పార్టీకి ఎంతో కొంత బలం చేకూరడంతోపాటు కార్యకర్తల్లో ప్రోత్సాహం నింపేది. అంతేకాని పలాయనం మంత్రం ఎంచుకుంటే పార్టీకి దీర్ఘకాలిక నష్టం తప్పదు. ప్రజాస్వామ్య ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం. ఆ ఎన్నికల అనుభవాన్ని తదుపరి ఎన్నికల్లో అనుకూలంగా మల్చుకుంటూ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. లోపాలపై గుణపాఠాలు నేర్చుకొని ముందడుగు వేయాలి, లేకపోతే ఆ పార్టీలకు మనుగడ కష్టమే.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ,

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ.

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధి ఐవీ మురళీకృష్ణ శర్మ
పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ప్రతినిధి ఐవీ మురళీకృష్ణ శర్మ