Kulgam encounter: కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్; ఐదుగురు ఉగ్రవాదుల హతం
Kulgam encounter: జమ్మూకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్ కౌంటర్ గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు సుదీర్ఘంగా కొనసాగింది.
Kulgam encounter: జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉన్న డిహెచ్ పోరా ప్రాంతంలోని సామ్నోలో గురువారం మధ్యాహ్నం ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి.
లష్కరే తోయిబా
ఈ ప్రాంతంలో కొందరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆశ్రయం పొందారన్న విశ్వసనీయ సమాచారంతో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని గురువారం మధ్యాహ్నం చుట్టుముట్టాయి. భద్రతాదళాల రాకను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రతాదళాల ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారు షోపియాన్‌కు చెందిన సమీర్ అహ్మద్ షేక్, డానిష్ థోకర్, ఉబైద్ పాత్ర, హజ్రా షా, కుల్గామ్‌కు చెందిన యాసిఫ్ భట్ గా గుర్తించారు. వీరు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన వారుగా నిర్ధారించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో 4 ఏకే సిరీస్ రైఫిల్స్, రెండు పిస్టల్స్, 4 గ్రెనేడ్స్, పెద్ద ఎత్తున పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో దాడులు చేసిన చరిత్ర
ఈ ఎన్ కౌంటర్ లో హతమైన టెర్రరిస్ట్ లు గతంలో పలు ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నారని భద్రతాదళాలు వెల్లడించాయి. వాటిలో, గత సంవత్సరం షోపియాలో కాశ్మీరీ పండిట్ సోను భట్‌పై జరిగిన దాడి, షోపియాలోని హెర్పోరా బటాగుండ్‌లో మైనారిటీ పికెట్‌పై జరిగిన దాడి, ఈ సంవత్సరం ప్రారంభంలో, షోపియాలో స్థానికేతర కార్మికులపై జరిగిన దాడి మొదలైనవి ఉన్నాయన్నారు. ఈ జాయింట్ ఆపరేషన్‌లో ఆర్మీకి చెందిన 34 రాష్ట్రీయ రైఫిల్స్, 9 పారా (ఎలైట్ స్పెషల్ ఫోర్స్ యూనిట్), జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ పాల్గొన్నాయి. ఇరు వర్గాల కాల్పుల్లో ఉగ్రవాదులు దాక్కున్న ఇంటికి నిప్పంటుకోవడంతో వారు బయటకు రాక తప్పలేదు.