తెరుచుకున్న కేదార్‌నాథ్ టెంపుల్.. భక్తులకు శివుడి దర్శనం
రుద్రప్రయాగ్ (ఉత్తరాఖండ్): శుక్రవారం ఉదయం కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తన భార్య గీతా ధామితో కలిసి ప్రార్థనలు చేశారు.
దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచే సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఏళ్ల నాటి సాంప్రదాయ ఆచారాన్ని అనుసరించి వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఆలయాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. గత ఏడాది నవంబర్ 6న ఆరు నెలల పాటు మంచు నేపథ్యంలో ఆలయాన్ని మూసివేశారు.
మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్‌నాథ్ దేవాలయం యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్‌లతో సహా 'చార్ ధామ్'గా పిలుచుకునే నాలుగు పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఎనిమిదో శతాబ్దంలో జగద్‌గురు ఆదిశంకరాచార్యచే కేదార్‌నాథ్ ఆలయం నిర్మితమైంది.
ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాల పోర్టల్‌లను తెరవడంతో వార్షిక చార్‌ధామ్ యాత్ర మే 3న అక్షయ తృతీయ శుభ సందర్భంగా ప్రారంభమైంది. బద్రీనాథ్ ఆలయ పోర్టల్స్ మే 8న తెరుస్తారు.
ఈ నెల ప్రారంభంలో చార్ ధామ్‌లను సందర్శించే యాత్రికుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పరిమితం చేసింది. బద్రీనాథ్ వద్ద రోజుకు 15,000 మంది, కేదార్‌నాథ్ వద్ద 12,000, గంగోత్రి వద్ద 7,000, యమునోత్రికి 4,000 మంది యాత్రికులను అనుమతిస్తారు. 45 రోజుల పాటు ఈ ఏర్పాట్లు చేశారు.
ఈ సంవత్సరం యాత్రికులు కోవిడ్-19 టెస్ట్ రిపోర్ట్ గానీ, టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లడం గానీ తప్పనిసరి కాదు.
సంబంధిత కథనం