Karnataka cabinet: సీఎం, డెప్యూటీ సీఎం కాకుండా మంత్రులుగా 8 మంది ప్రమాణం
పరాజయ పరంపరలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ కు ఆక్సిజన్ అందించిన కర్నాటక ఎన్నికల ప్రహాసనం ముగిసింది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. వీరిద్దరు కాకుండా, మరో 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.
Karnataka cabinet: పరాజయ పరంపరలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ (CONGRESS) కు ఆక్సిజన్ అందించిన కర్నాటక ఎన్నికల (Karnataka assembly elections) ప్రహాసనం ముగిసింది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రమాణ స్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar) ప్రమాణం చేశారు. వీరిద్దరు కాకుండా, మరో 8 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
Karnataka cabinet: 8 మంది మంత్రులుగా
ప్రమాణ స్వీకారం చేసిన నాయకుల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఉన్నారు. అలాగే, జీ పరమేశ్వర, ఎంపీ పాటిల్, కేహెచ్ మునియప్ప, కేజే జార్జి, సతీశ్ జార్ఖిహోలి, రామలింగా రెడ్డి, బీజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతానికి సిద్ధరామయ్య మంత్రివర్గంలో సీఎం, డెప్యూటీ సీఎం సహా 10 మంది మంత్రులు కొలువు తీరారు. వీరు కాకుండా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం మరో 23 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది.
Karnataka cabinet:అన్ని వర్గాలకు అవకాశం
కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన నేతల్లో దాదాపు అన్ని వర్గాలకు సముచిత అవకాశం కల్పించారు. ఎంబీ పాటిల్ కర్నాటకలోని ప్రముఖ లింగాయత్ నాయకుడు. జీ పరమేశ్వర ప్రముఖ దళిత నేత. ఈ ఇద్దరు నాయకులు కూడా తమకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ, ఏకైక డెప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్పష్టం చేయడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఒక దశలో సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ సీఎ పీఠం కోసం పోటీ పడుతున్న సమయంలో.. వారిద్దరిని కాదని దళిత నేత పరమేశ్వరకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. పరమేశ్వర పీసీసీ చీఫ్ గా కూడా దాదాపు ఎనిమిదేళ్లు పని చేశారు. లింగాయత్ నేత ఎంబీ పాటిల్ కుమార స్వామి కేబినెట్ లో హోం మంత్రిగా పని చేశారు. మునియప్ప దాదాపు గత మూడు దశాబ్దాలుగా ఎంపీగా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. కర్నాటక నూతన మంత్రిగా పని చేసిన కేజే జార్జి క్రిస్టియన్ మైనారిటీ. ఇటీవలి ఎన్నికల్లో జార్జి సమీప బీజేపీ అభ్యర్థి పద్మనాభ రెడ్డిపై 55,768 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.