Japan birth rate decline : జపాన్లో జననాల రేటు ఆందోళనకర రీతిలో పడిపోతుండటం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ఇలాగే కొనసాగితే.. జపాన్, తన ఉనికిని కోల్పోతుందని, బతకడానికి తమ దేశంలో ఎవరూ ఉండరని.. ప్రధాని ఫుమియో కిషిదా సలహాదారు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఆందోళన మరింత పెరిగింది.
పిల్లలను కనేందుకు జపాన్ ప్రజలు ముందుకు రావడం లేదు. ఫలితంగా ఇటు జననాల రేటు తగ్గిపోతుంటే, అటు వృద్ధుల మరణాల రేటు పెరిగిపోతోంది. గతేడాది.. జపాన్లో పుట్టిన వారి కన్నా మరణించిన వారి సంఖ్య రెండింతలు ఎక్కువగా నమోదైంది. 8లక్షల కన్నా తక్కువ పిల్లలు గతేడాది జన్మించగా.. అదే సమయంలో 1.58 మిలియన్ మంది మరణించారు. ఈ లెక్కలను ఫిబ్రవరి 28న విడుదల చేసింది అక్కడి ప్రభుత్వం.
Japan birth rate and death rate : 2008లో జపాన్ జనాభా 128 మిలియన్గా ఉండేది. ఇదే అత్యధికం. అప్పటి నుంచి జనాభా తగ్గుతూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ ఇంకా దారుణంగా పడిపోతోంది. యువత జనాభా కూడా తగ్గుముఖం పడుతోంది. 2022లో మొత్తం మీద 65, అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న వారు.. జపాన్లో 29శాతం కన్నా అధికంగా ఉన్నారు. సౌత్ కొరియాలో సంతానోత్పత్తి రేటు దారుణంగా పడిపోతుండగా.. జపాన్లో ఏకంగా జనాభానే తగ్గిపోతుండటం గమనార్హం.
"జననాల రేటు తగ్గడం లేదు. దారుణంగా పడిపోతోంది. ఇలా జరుగుతోందంటే.. సమాజంలో పిల్లలు తక్కువగా ఉన్నట్టు. ఇదంతా సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పరిస్థితులను చక్కదిద్దకపోతే సమాజంలోని భద్రతా వ్యవస్థ కుప్పకూలుతుంది. పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థలు పడిపోతాయి. రక్షణ రంగంలో రిక్రూట్మెంట్లు తగ్గిపోతాయి. ఇది దేశ భద్రతకు కూడా ముప్పు కలిగిస్తుంది," అని ప్రధాని కిషిదా సలహాదారు, మాజీ మంత్రి మోరి మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి.
Japan birth rate latest news : దేశంలో నెలకొన్న సమస్యను పరిష్కరిస్తానని ప్రధాని కిషిదా చెబుతున్నారు. పిల్లలు, కుటుంబ సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తుందని హీమీనిచ్చారు. ఇందుకు సంబంధించిన పథకాన్ని కిషిదా ప్రకటించాల్సి ఉంది. అయితే.. ఇప్పటివరకు ఉన్న విధానాల కన్నా.. తాము తీసుకురానున్న పాలసీ చాలా కొత్తగా, భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
కిషిదా వ్యాఖ్యలపై పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి సమస్యల్లో డబ్బులు ఖర్చు పెడితే సరిపోదని, మరిన్న చర్యలు చేపట్టాలని అంటున్నారు. పిల్లల తల్లులపై భారాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. పిల్లల పెంపకంలోనూ మహిళలు- పురుషుల పాత్ర సమానంగా ఉండాలని చెబుతున్నారు. అప్పుడే.. మహిళలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా పనికి వెళ్లొచ్చని అంటున్నారు.