Semeru volcano : ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ వస్తుందా?-indonesias semeru volcano erupts people warned to stay away ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Semeru Volcano : ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ వస్తుందా?

Semeru volcano : ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. సునామీ వస్తుందా?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 04, 2022 11:50 AM IST

Semeru volcano erupts in Indonesia : ఇండోనేషియాలో ఆదివారం తెల్లవారుజామున అగ్నిపర్వతం బద్ధలైంది. ఫలితంగా ఆ ప్రాంతం అంతా బూడిదతో నిండిపోయింది.

బద్ధలైన సెమెరు అగ్నిపర్వతం
బద్ధలైన సెమెరు అగ్నిపర్వతం (AP)

Semeru volcano erupts in Indonesia : ఇండోనేషియా జావా ద్వీపంలోని సెమెరు అగ్నిపర్వతం బద్ధలైంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో.. 1.5కి.మీల దూరం వరకు గాలిలో బూడిద వ్యాపించింది. సెమెరు అగ్నిపర్వతం బద్ధలవ్వడంతో అప్రమత్తమైన అధికారులు.. ఆ ప్రాంతం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

సెమెరు అగ్నిపర్వతం బద్ధలైన ప్రాంతం నుంచి 5కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి కార్యకలాపాలు సాగించవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఇండోనేషియా విపత్తు నిర్వహణ బృందం. ఆదివారం తెల్లవారుజామున 2:46 గంటల సమయంలో అగ్నిపర్వతం బద్ధలైందని తెలుస్తోంది. ఫలితంగా ఆ ప్రాంతాన్ని దట్టమైన బూడిద కమ్మేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

మరోవైపు.. స్థానిక ప్రజలకు మాస్కులను పంపిణీ చేశారు ఇండోనేషియా అధికారులు. తూర్పు జావా రాష్ట్రంలోని లుమజంగ్​ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను మొదలుపెట్టారు. తొలుత అగ్నిపర్వతం తీవ్రతను లెవల్​-3గా గుర్తించిన అధికారులు.. కొన్ని గంటలకే లెవల్​-4కు మార్చారు. లెవల్​ 4ను అత్యంత తీవ్రమైనదిగా భావిస్తారు.

Indonesia Semeru volcano : ఇండోనేషియాలో మొత్తం మీద 142 ఆగ్నిపర్వతాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా.. అగ్నిపర్వతాలకు అత్యంత సమీపంలో నివాసముంటున్న ప్రజలు ఇండోనేషియాలోనే ఉన్నారు.

ఈ సెమెరు అగ్నిపర్వతం ఎత్తు 3,676 మీటర్లు. అగ్నిపర్వతం బద్ధలుకావడంతో సమీప ప్రాంతాలన్నీ లావాతో నిండిపోయాయి.

చివరిసారిగా.. గతేడాది డిసెంబర్​లో ఈ సెమెరు అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ ఘటనలో 51మంది మరణించారు. వందలాది మందికి గాయాలయ్యాయి. అనేకమందికి చర్మం కాలిపోయింది. సమీపంలోని అనేక గ్రామాలు మట్టిలో కూరుకుపోయాయి. ఆ సమయంలో.. సుమారు 10వేల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారు.

గత 200ఏళ్లల్లో.. ఈ సెమెరు అగ్నపర్వతం ఎన్నోసార్లు బద్ధలైంది. ఇండోనేషియాలో 129 అగ్నిపర్వతాలు నిత్యం యాక్టివ్​గానే ఉంటాయి. అయినప్పటికీ.. వేలాది మంది ప్రజలు అక్కడే జీవితాన్ని సాగిస్తూ ఉంటారు.

ఇక్కడ భూకంపాలు కూడా తరచూ సంభవిస్తూ ఉంటాయి. ఈ పరిణామాలతో ఇక్కడి ప్రజలు నిత్యం బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ ఉంటారు.

సునామీ వస్తుందా?

ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్ధలైన ఘటనను జపాన్​ వాతావరణశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సునామీ వచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది.

Semeru volcano eruption : అగ్నిపర్వతం వల్ల సునామీ వస్తే.. ఘటనాస్థలం నుంచి జపాన్​ను అది తాకడానికి కేవలం 3 గంటల కన్నా తక్కువ సమయమే పడుతుందని జపాన్​ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

సునామీ వచ్చే ప్రమాదంపై ఇండోనేషియా అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం