Covid Rules: కొవిడ్ మార్గదర్శకాల్లో మార్పు.. ఈ ఆరు దేశాల మీదుగా వచ్చే వారికి కూడా నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి
Covid Guidelines Revised: చైనా సహా మరో ఐదు దేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్-19 మార్గదర్శకాల్లో మార్పులు చేసింది భారత్. నేరుగా వచ్చే వారితో పాటు వేరే ప్రాంతాల నుంచి వయా ఆ దేశాల గుండా వచ్చే వారికి కూడా ఆర్‌టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి అని చెప్పింది.
Covid Guidelines Revised: కొన్ని దేశాల్లో కొవిడ్-19 వ్యాప్తి అధికంగా ఉండటంతో భారత ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా వేరే దేశాల నుంచి వచ్చే వారి వల్ల ఇక్కడ వైరస్ వ్యాప్తి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‍ల్యాండ్ దేశాల నుంచే వచ్చే వారు.. ఇండియాలో అడుగుపెట్టకముందే ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికేట్‍ను సమర్పించడం కచ్చితం చేసింది. ఇంత వరకు ఈ దేశాల నుంచి నేరుగా వచ్చే వారికే ఈ నిబంధన ఉంది. అయితే కొత్త మార్పుల ప్రకారం, వేరే చోట్ల నుంచి ఆ దేశాల మీదుగా వచ్చే వారికి కూడా ఈ రూల్ వర్తిస్తుంది. ఆ ఆరు దేశాల నుంచి వచ్చే వారు ఇక తప్పకుండా ఎయిర్ సువిధ (Air Suvidha) పోర్టల్‍లో ఆర్టీ-పీసీఆర్ సెట్ నెగెటివ్ రిపోర్టును అప్‍లోడ్ చేసిన తర్వాత బయలుదేరాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇవే.
72 గంటల వ్యవధిలోనే..
Covid Guidelines Revised: చైనాతో పాటు మరో ఐదు దేశాల మీదుగా భారత్‍కు రావాలనుకుంటున్న వారు బయలుదేరే ముందు 72 గంటల వ్యవధిలోనే ఆర్-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. ఆ టెస్టులో నెగెటివ్ వస్తే.. బయలుదేరే ముందే ఎయిర్ సువిధ (Air Suvidha) పోర్టల్‍లో అప్‍లోడ్ చేసి.. అనుమతి పొందాలి. ఆ తర్వాత మాత్రమే ఇండియాకు వచ్చే అవకాశం ఉంటుంది. భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ సూచనలు జారీ చేసింది. నేరుగా ఆ దేశాల నుంచి రావాలన్నా ఈ ప్రక్రియ తప్పనిసరి.
చైనాలో ఒమిక్రాన్ బీఎఫ్ 7 (omicron bf 7) వేరియంట్ విజృంభణతో కొవిడ్-19 కేసులో కోట్లలో నమోదవుతున్నాయి. మరణాలు కూడా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. క్రమంగా జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‍లాండ్‍లోనూ కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్‍లో మరో వేవ్‍కు అవకాశం రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.
మరోవైపు, ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ ఇండియాలో వ్యాప్తి చెందకపోవచ్చని కొందరు వైద్య నిపుణులు చెబుతున్నారు. భారతీయుల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని, మరో వేవ్‍కు అవకాశం ఉండబోదనేలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.