Meenakshi Lekhi: ‘భారత్ మాతా కీ జై’ అని నినదించడం లేదని సభికులపై మీనాక్షి లేఖి ఆగ్రహం; వెళ్లిపోవాలని మండిపాటు
Meenakshi Lekhi: తనతో పాటు భారత్ మాతా కీ జై అని నినదించడం లేదని సభికులపై కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని భరత మాతగా గౌరవించని వారు ఇక్కడ ఉండవద్దని మండిపడ్డారు. ఈ ఘటన శనివారం కేరళలోని కోజికోడ్ లో చోటు చేసుకుంది.
శనివారం కోజికోడ్ లో జరిగిన యూత్ కాన్ క్లేవ్ లో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి సభికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ‘భారత్ మాతాకీ జై’ అని నినదించడం లేదని, అలాంటి వారు ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోవాలని సభికులపై విరుచుకుపడ్డారు. భారతదేశం మీకు తల్లి కాదా? అని ప్రశ్నించారు. భారతదేశంపై పై ఏమాత్రం గౌరవం, ప్రేమ లేని వ్యక్తి యూత్ కాన్ క్లేవ్ లో ఉండకూడదని మంత్రి ఆదేశించారు. కేంద్ర మంత్రి తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు, సమర్ధనలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో వైరల్
యూత్ కాంక్లేవ్ లో సభికులపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె తీరుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కోజికోడ్ లో జరిగిన యూత్ కాంక్లేవ్ లో కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి శనివారం పాల్గొన్నారు. తన ప్రసంగం అనంతరం ఆమె ‘భారత్ మాతా కీ జై’ అని నినదించారు. తనతో పాటు హాల్ లో ఉన్న సభికులను కూడా ‘భారత్ మాతా కీ జై’ అని అని నినదించాలని ఆమె కోరారు. అయితే, ఆమె అభ్యర్థనకు కొందరు సభికుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దాంతో, ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బయటకు వెళ్లాలని ఆదేశం
మరోసారి భారత్ మాతా కీ జై అని నినదించిన మీనాక్షి లేఖి, సభికుల్లో కొందరు చేతులు కట్టుకుని కూర్చున్నారని, వారు భారత్ ను తమ తల్లిగా భావించడం లేదా? అని ప్రశ్నించారు. ‘‘భారత్ నాకు ఒక్కదానికే మాతనా? మీకు కాదా?’’ అని ప్రశ్నించారు. ప్రత్యేకంగా పసుపు డ్రెస్ వేసుకుని ఉన్న యువతిని ఉద్దేశించి, భారత్ మాతా కీ జై అని నినదించడం ఇష్టం లేకపోతే, భారత్ మాతా కీ జై అని నినదించడానికి సిగ్గుగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆమెకు స్పష్టం చేశారు. దేశంపై ఏమాత్రం ప్రేమ, గౌరవం లేని వారు, భారత్ గురించి మాట్లాడటానికి ఇబ్బందిగా భావించే వారు యువజన సదస్సులో ఉండాల్సిన అవసరం లేదని లేఖి వ్యాఖ్యానించారు.