Independence Day 2023: మన జాతీయ జెండా గురించి ఎవ్వరికీ తెలియని అరుదైన విశేషాలు.. మీ కోసం..-independence day 2023 interesting facts about indias tricolor national flag ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Independence Day 2023: మన జాతీయ జెండా గురించి ఎవ్వరికీ తెలియని అరుదైన విశేషాలు.. మీ కోసం..

Independence Day 2023: మన జాతీయ జెండా గురించి ఎవ్వరికీ తెలియని అరుదైన విశేషాలు.. మీ కోసం..

HT Telugu Desk HT Telugu
Aug 11, 2023 02:56 PM IST

Independence Day 2023: 77వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం భారత్ సిద్ధమవుతోంది. ఆగస్ట్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ జెండా ప్రాముఖ్యతపై, జెండా విలువపై అవగాహన పెంచేలా ప్రభుత్వం ‘ప్రతీ ఇంటా.. జాతీయ జెండా’ కార్యక్రమం చేపట్టింది.

జాతీయ జెండా
జాతీయ జెండా

Independence Day 2023: 77 వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం భారత్ సిద్ధమవుతోంది. ఆగస్ట్ 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్ర కోట వద్ద మన జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జాతీయ జెండా ప్రాముఖ్యత తెలిపేలా, జెండా విలువపై అవగాహన పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కీ అమృత మహోత్సవ్ (Azadi Ka Amrit Mahotsav) కార్యక్రమంలో భాగంగా ‘ప్రతీ ఇంటా.. మువ్వన్నెల జెండా (Har Ghar Tiranga) ’ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా.. ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 15 వరకు ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని సూచించింది.

స్వాతంత్య్ర పోరాటంలో గొప్ప పాత్ర

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయులు చేపట్టిన స్వాతంత్య్రోద్యమంలో మూడు రంగుల జెండాకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆ జెండా చేతబూని, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, సత్యాహింసలు ఆయుధాలుగా, మహాత్మాగాంధీ నాయకత్వంలో అశేష భారతావని స్వాతంత్య్రం మా జన్మహక్కని నినదిస్తూ, ఉద్యమ ప్రస్థానంలో ముందడుగు వేసింది. చివరకు, దాదాపు 200 ఏళ్ల వలస పాలనకు చరమగీతం పాడుతూ, 1947 ఆగస్ట్ 15న స్వాతంత్య్రం సాధించుకుంది.

India's national flag facts: మన జాతీయ జెండా విశేషాలు..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మన జాతీయ జెండా కు సంబంధించిన అరుదైన విశేషాలు మీ కోసం..

  • మన మూడు రంగుల జెండాను మొదటి సారి 1906 ఆగస్ట్ 7 వ తేదీన కోల్ కతాలోని పార్సీ బేగన్ స్క్వేర్ లో ఎగురవేశారు. అప్పుడు ఆ జెండాలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ప్రధాన రంగులుగా ఉన్నాయి.
  • 1931 లో జరిగిన కాంగ్రెస్ మహాసభ మూడు రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించింది. ఆ సమయంలో ఆ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో చరఖా (spinning wheel) ఉంది.
  • ఆ తరువాత ఆ జెండాకు కొన్ని మార్పులు చేశారు. మూడు రంగుల మధ్యలో, చరఖా స్థానంలో అశోక చక్రం ను పొందుపర్చారు. ఈ జెండాను 1947 జులై 22 న అధికారికంగా జాతీయ జెండాగా ఆమోదించారు. ఈ జెండానే 1947 ఆగస్ట్ 15న ఎగురవేశారు.
  • ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న జాతీయ జెండాను మొదట తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల మధ్య అశోక చక్రంతో జెండాను రూపొందించారు.
  • గతంలో జాతీయ జెండాను ఎగురవేయడానికి కొన్ని ఆంక్షలు ఉండేవి. కొన్ని ఎంపిక చేసిన ముఖ్యమైన రోజుల్లోనే జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం ఉండేది. కానీ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ దాదాపు పదేళ్ల పాటు న్యాయపోరాటం చేయడంతో, ఆ ఆంక్షలను తొలగిస్తూ, సుప్రీంకోర్టు 2004 జనవరి 23న తీర్పునిచ్చింది.
  • జాతీయ జెండాకు సముచిత గౌరవం ఇస్తూ, రాజ్యాంగంలోని 19(1) (a) అధికరణ పరిధిలో, జాతీయ జెండాను ఎగురవేయగలగడం భారతీయ పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • జాతీయ జెండాలో పై భాగంలో ఉన్న కాషాయ రంగు శక్తికి, ధైర్యానికి ప్రతీకగా.. మధ్యలో ఉన్న శ్వేత వర్ణం శాంతికి, సత్యానికి గుర్తుగా.. కింది భాగంలో ఉన్న ఆకుపచ్చ వర్ణం ప్రగతికి, పవిత్రతకు తార్కాణంగా భావిస్తారు. మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మానికి ప్రతీకగా పేర్కొంటారు.
  • ఆగస్ట్ 15వ తేదీని మరో ఐదు దేశాలు కూడా స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటాయి. అవి బహ్రెయిన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లీచ్టెన్ స్టీన్.