Independence Day 2023: 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ సిద్ధమవుతుంది. దేశవ్యాప్తంగా వాడవాడలా జండా వందనానికి దేశ ప్రజలు ఆనందోత్సాహాలతో సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జండా వందనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పులు.. మొదలైన వివరాలు తెలుసుకుందాం..
ఆగస్ట్ 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జాతీయ జెండాలను ఎగురవేస్తారు. దాంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పబ్లిక్ ప్లేసెస్ లో జెండా వందనం చేస్తారు. సాధారణంగా, ఉదయమే జెండా వందనం చేసి, మిఠాయిలు పంచుతారు. దేశ ఐక్యత, సమగ్రతకు నిదర్శనంగా జెండా పండుగ నిలుస్తుంది.
జెండా వందనం సమయంలో పాటించాల్సిన కొన్ని నిబంధనలు ఉంటాయి. జెండా పొడవు, వెడల్పుల విషయంలో కూడా కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మన జాతీయ జెండాలోని మూడు రంగుల్లో పైన ఉన్న కాషాయం శక్తికి, సామర్ధ్యానికి, ధైర్యానికి ప్రతీక అయితే, మధ్యలో ఉన్న శ్వేత వర్ణం శాంతి, సమృద్ధికి ప్రతీక. కింది భాగంలో ఉండే ఆకుపచ్చ రంగు త్యాగం, శాంతి, సౌభ్రాతృత్వాలకు తార్కాణం. మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మానికి నిదర్శనంగా నిలుస్తుంది.