Hijab row in Karnataka : ‘హిజాబ్ వివాదంలో మా తీరు కరెక్టే’
Hijab row in Karnataka : కర్నాటకలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న హిజాబ్ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైనదేనని కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. కర్నాటక ప్రభుత్వం తీరు మతపరమైన తటస్థతకు నిదర్శనమని స్పష్టం చేసింది.
Hijab row in Karnataka : కర్నాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ను ధరించడంపై కొన్నాళ్లుగా వివాదం సాగుతోంది. ముస్లిం విద్యార్థినులు విద్యాసంస్థల్లో ముఖంపై ధరించే ఈ హిజాబ్ ను నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ముస్లిం విద్యార్థినులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. పరీక్షలను కూడా బహిష్కరించారు. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
Hijab row in Karnataka : తటస్థ నిర్ణయమే
హిజాబ్ విషయంలో కర్నాటక ప్రభుత్వం తీసుకున్నది మతపరమైన తటస్థతకు నిదర్శనమని కర్నాటక ప్రభుత్వం తరఫు న్యాయవాది తుషార్ మెహతా వాదించారు. సమాజంలో విద్వేషం, రెండు వర్గాల మధ్య విబేధాలు లేవనెత్తే కుట్రలో భాగంగా దీన్ని వివాదాస్పదం చేశారన్నారు. ఇందులో ఫీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా Popular Front of India PFI)) పాత్ర ప్రధానంగా ఉందని ఆరోపించారు.
Hijab row in Karnataka : PFI కుట్రే..
విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై తలెత్తిన వివాదం ఏ కొందరు విద్యార్థినులో, అప్పటికప్పుడు లేవనెత్తింది కాదని, కావాలని, కుట్ర పూరితంగా ఈ వివాదాన్నిరాజేశారని సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. PFI సోషల్ మీడియాలో ఈ విషయాన్ని కావాలనే పెద్ద ఎత్తున ప్రచారం చేసి, భావద్వేగాలు రెచ్చగొట్టిందని విమర్శించారు. ఇప్పటికీ "start wearing hijab" పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగిస్తోందన్నారు. దీనిపై ప్రభుత్వం సరైన విధంగానే స్పందించిందని, అలా చేయని పక్షంలో అది తన రాజ్యాంగబద్ధ బాధ్యతను నిర్వర్తించనట్లయ్యేదని ఆయన వివరించారు. కర్నాటకలోని విద్యా సంస్థల్లో హిజాబ్ ను ధరించడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై మంగళవారం జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధులియాల ధర్మాసనం విచారణ జరిపింది.
Hijab row in Karnataka : కాషాయ కండువాలు
విద్యా సంస్థల్లో ధరించకూడదని ప్రభుత్వం నిషేధించినది కేవలం హిజాబ్ లనే కాదని, సమానత్వాన్ని, సమగ్రతను, సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే అన్ని రకాల దుస్తులను ధరించకూడదని ప్రభుత్వం ఆ నిషేధ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నదని తుషార్ మెహతా వివరించారు. హిజాబ్ వివాదం ప్రారంభమైన తరువాత, కొందరు హిందూ విద్యార్థినులు కాషాయ రంగులో కండువాలు(స్టోల్స్) వేసుకుని రావడం ప్రారంభించారని, వాటిని కూడా ప్రభుత్వం నిషేధించిందని వివరించారు.