Israel Palestine war: ‘‘మొత్తం కుటుంబాన్ని చంపేశారు.. రెండేళ్ల పిల్లాడినీ వదల్లేదు’’
Israel Palestine war: ఇజ్రాయెల్ లో హమాస్ ఉగ్రవాదులు (hamas) ఒక కుటుంబాన్ని దారుణంగా హతమార్చారు. బంకర్ లో తలదాచుకున్న మొత్తం కుటుంబాన్ని, ముగ్గురు చిన్నారులతో సహా కిరాతకంగా చంపేశారు. (Israel Palestine war)
Israel Palestine war: ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ లో జానీ, తామర్ దంపతులు, వారి ఆరేళ్ల కవల పిల్లలు షేచర్, ఆర్బెల్, రెండేళ్ల కొడుకు ఒమర్ నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధం (Israel Palestine war) ఆ కుటుంబం పాలిట మృత్యువుగా మారింది.
ఆస్ట్రేలియాకు మెసేజ్..
ఇజ్రాయెల్ లోకి హమాస్ ఉగ్రవాదులు చొరబడ్డారని, ఇజ్రాయెల్ పౌరులను కిడ్నాప్ చేస్తున్నారన్న వార్తలు ఒక్క సారిగా గుప్పమనడంతో, జానీ, తామర్ దంపతులు తమ పిల్లలతో సహా తమ ఇంట్లోని రహస్య కాంక్రీట్ బంకర్ లోకి వెళ్లారు. ఈ విషయాన్ని తామర్ ఆస్ట్రేలియాలో ఉండే తన స్నేహితురాలు యిషాయికి మెసేజ్ చేసింది. తమ ఇంట్లోని కాంక్రీట్ బంకర్ లో తల దాచుకున్నామని, ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉందని తామర్ తన స్నేహితురాలికి మెసేజ్ చేసింది. కాసేపటి తరువాత నుంచి తామర్ నుంచి మెసేజ్ లు రావడం ఆగిపోయింది. ఎంత ప్రయత్నించిన్నా తామర్ కుటుంబ క్షేమ సమాచారాన్ని యిషాయి తెలుసుకోలేకపోయింది.
బంకర్ లో దూరి..
రెండు రోజుల తరువాత, వారి ఇరుగు పొరుగును సంప్రదించడానికి యిషియి ప్రయత్నించింది. చివరకు తన స్నేహితురాలి కుటుంబానికి జరిగిన దారుణాన్ని తెలుసుకోగలిగింది. ఈ విషయన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కన్నీటి పర్యంతమైంది. రెండేళ్ల పిల్లవాడిని కూడా కనికరించకుండా, దారుణంగా చంపేశారని విలపించింది. హమాస్ ఉగ్రవాదులు తామర్ కుటుంబం తల దాచుకున్న బంకర్ లోకి దూరి, మొదట తామర్, జానీ దంపతులను చంపేశారని, ఆ తరువాత చిన్న పిల్లలని కూడా చూడకుండా ఆ చిన్నారులను కూడా చంపేశారని వెల్లడించింది. తన స్నేహితురాలు తనకు పంపిన చివరి సందేశాన్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.