Gujarat Elections 2022: మద్యం బాక్స్‌లతో కెమెరాకు చిక్కిన బీజేపీ నేత! వీడియో వైరల్
Gujarat Elections 2022 - Phase 2: అరవల్లీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు.. మద్యం బాటిళ్లను యథేచ్ఛగా తీసుకెళుతున్నారంటూ ఓ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ అయింది. దీనిపై గుజరాత్ ఎన్నికల సంఘం స్పందించింది.
Gujarat Elections 2022 - Phase 2: గుజరాత్ శాసనసభ ఎన్నికల తుది దశ పోలింగ్ సాగుతోంది. సోమవారం ఉదయం మొదలైన ఓటింగ్ సజావుగా జరుగుతోంది. రెండో దశలో భాగంగా 93 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే గుజరాత్‍లోని అరవల్లీ (Aravalli) జిల్లా బీజేపీ అధ్యక్షుడి తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు పోలింగ్ జరుగుతున్న సమయంలో ఆయన మద్యం బాక్సులను తీసుకెళుతున్నట్టు ఓ వీడియో బయటికి వచ్చింది. ఆ వీడియో వైరల్ అయింది. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది. పూర్తి వివరాలు ఇవే..
ఇదీ జరిగింది..
Gujarat Elections 2022 - Phase 2: అరవల్లీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు.. బహిరంగంగా మద్యం బాక్సులు తీసుకెళుతున్నారంటూ దీపక్ ఖత్రీ అనే యూజర్ ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. “గుజరాత్‍లో అరవల్లీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు.. ఓపెన్‍గా మద్యం బాక్సులను తీసుకెళుతున్నారు! బీజేపీ వారు మద్యం పంచుతున్నారు. ఎన్నికల సంఘం ఈ విషయంపై మౌనం వహిస్తోంది. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ ఏదైనా వివరణ ఇస్తుందా” అని ఆ వ్యక్తి రాసుకొచ్చారు. కొందరు వ్యక్తులు మద్యం బాటిళ్లను కారులో పెడుతున్నట్టు ఆ వీడియోలో ఉంది.
స్పందించిన ఎన్నికల సంఘం
Gujarat Elections 2022 - Phase 2: అరవల్లీ జిల్లా బీజేపీ అధ్యక్షుడు.. మద్యం బాక్సులు తీసుకెళుతున్నారని సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ అవటంతో.. గుజరాత్ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. ట్విట్టర్‌లో ఈ వీడియోకు రిప్లే ఇచ్చింది. ప్రొహిబిషన్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పేర్కొంది. “ఎస్పీ సమాచారం ప్రకారం, పోలీసులు వెంటనే ఆ ఘటన స్థలానికి వెళ్లారు. గుజరాత్ ప్రొహిబిషన్ 1949 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. రూ.87,600 విలువైన 879 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ జరుగుతోంది” అని గుజరాత్ ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే, మద్యంతో పట్టుబడిన ఆ బీజేపీ నాయకుడిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ చాలా మంది యూజర్లు ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
Gujarat Elections 2022: ప్రశాంతంగా పోలింగ్
గుజరాత్ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ 93 స్థానాల్లో సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 34.74 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉదయం 8 గంటలకు ఓటింగ్ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అహ్మదాబాద్‍లో ఓటు వేశారు.
నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఈనెల 8వ తేదీన గుజరాత్ శాసనసభ ఎన్నికల ఓట్లు లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.