Gujarat Election Results: గుజరాత్ ఎన్నికల్లో అనూహ్యం.. కాంగ్రెస్, బీటీపీని తిరస్కరించిన ఆ ప్రాంత గిరిజనులు
Gujarat Election Results 2022: గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీ హవా సాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వస్తున్నాయి. దక్షిణ గుజరాత్‍లో దశాబ్దాలుగా కాంగ్రెస్, బీటీపీని ఆదరిస్తున్న గిరిజనులు.. ఈసారి తిరస్కరించారు. ఇది ఆ పార్టీలకు ఎదురుదెబ్బగా మారింది. పూర్తి వివరాలివే..
Gujarat Election Results 2022: గుజరాత్ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (BJP) రికార్డు విజయం దిశగా దూసుకుపోతోంది. వరుసగా ఏడోసారి గెలవడం దాదాపు ఖాయమైంది. అయితే, ఎన్నడూ లేని విధంగా దక్షిణ గుజరాత్‍లోని గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లోనూ కమలం పార్టీ ఆధిపత్యం కనబరుస్తోంది. ఎన్నికల ముందు ఎంతో వ్యతిరేకత కనిపించినా.. ఆ ప్రాంతాల్లోనూ కషాయ పార్టీ దూకుడు కొనసాగుతోంది. కాంగ్రెస్, భారతీయ ట్రైబల్ పార్టీ (BTP)కి కంచుకోటగా ఉన్న సీట్లను కూడా బీజేపీ బద్దలుకొడుతోంది. పూర్తి వివరాలు ఇవే..
ఈ స్థానాల్లో అనూహ్యంగా..
Gujarat Election Results 2022: సూరత్, తాపి, బహారుచ్ జిల్లాల్లోని డాంగ్ (Dang) , నిఝార్ (Nizar), వ్యారా (Vyara), మాండ్వీ (Madvi), ఝగాడియా (Jhagadia), డేడియాపాడా (Dediapada) లాంటి గిరిజన ప్రాబల్యం ఎక్కువగా కీలక స్థానాల్లో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో 65 నుంచి 74శాతం వరకు పోలింగ్ నమోదైంది. అయితే, ఈ స్థానాల్లో గత ఎన్నికల వరకు కాంగ్రెస్, బీటీపీ తిరులేని ఆధిపత్యాన్ని చూపాయి. ఈసారి కూడా అదే జరుగుతుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా గిరిజనులు మాత్రం కాంగ్రెస్, బీటీపీని తిరస్కరించారు. ఊహించని ఫలితాలను ఇస్తున్నారు.
ఈ సమస్యల ప్రభావం లేనట్టే!
Gujarat Poll Results 2022: పర్-తాపి-నర్మదా నది అనుసంధాన ప్రాజెక్టు, నిరుద్యోగం అంశాలపై గిరిజనుల నుంచి ఎన్నికల ముందు బీజేపీకి వ్యతిరేకత వ్యక్తమైంది. అలాగే జాతీయ ఐక్యతా విగ్రహం (Statue of Unity - SOU) ప్రాజెక్టు వల్ల చాలా మంది గిరిజనులు భూములు కోల్పోయారు. ఈ అంశం వల్ల గిరిజన ప్రాంతాల్లో మరింత దెబ్బ తింటుందని అంచనాలు వచ్చాయి. అయితే ఫలితాలు మాత్రం వాటిని తలకిందులు చేశాయి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని విధంగా బీజేపీ సత్తాచాటుతోంది.
కాంగ్రెస్ కంచుకోటలో..
Gujarat Election Results 2022: కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న వ్యారా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పునాజీ గామిత్ వెనుకబడ్డారు. వరుసగా నాలుగుసార్లు గెలిచిన ఆయనను.. ఈసారి బీజేపీ అభ్యర్థి మోహన్ కొంకణి వెనక్కి నెడుతున్నారు. 10వ రౌండ్ ముగిసే సరికి కొంకణి ఏకంగా 11,000 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. 2017లో సుమారు 24వేల ఆధిక్యంతో గెలిచిన పునాజీ ఈసారి వెనుకబడ్డారు.
తాపి జిల్లాలోని నిఝార్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్ గామిత్ వెనుకబడ్డారు. ఈ స్థానంలో కాంగ్రెస్‍కు ఎదురుదెబ్బ తగలడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి జైరామ్ గామిత్ ముందంజలో ఉండగా.. సునీల్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
డంగ్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ మరోసారి చేజిక్కించుకోవటం దాదాపు ఖాయమైంది. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ పటేల్.. కాంగ్రెస్ అభ్యర్థిపై ఇప్పటికే 10వేలకు పైగా మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
చోటూభాయ్‍కి షాక్!
భారతీయ ట్రైబల్ పార్టీ (BTP) వ్యవస్థాపకులు చోటూభాయ్ వసావా (Chhotubhai Vasava) నియోజకవర్గమైన ఝగాడియాలోనూ బీజేపీ జోరు కనబరుస్తోంది. ఈ స్థానంలో ఏడుసార్లు వరుసగా గెలిచిన చోటూభాయ్.. ఈసారి వెనుకబడ్డారు. బీజేపీ అభ్యర్థి హితేశ్ వసావా చేతిలో ఆయన ఓటమి పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1990 నుంచి ఝగాడియా ఎమ్మెల్యేగా ఉన్నారు చోటూభాయ్.
నర్మదా జిల్లా డేడియాపాడా అసెంబ్లీ నియోజకవర్గంలోనూ బీటీపీ పట్టుకోల్పోతోంది. ఆప్‍ఆద్మీ పార్టీ అభ్యర్థి చైతర్ వసావా అక్కడ 10వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.
డేడియాపాడాలో జైతర్, ఝంగాడియాలో బీజేపీ అభ్యర్థి హితేశ్ గెలిస్తే.. ఇక దక్షిణ గుజరాత్‍లోని గిరిజన వర్గంలో బీటీపీ ఆధిపత్యం ముగిసినట్టే భావించవచ్చు.
ఆ ఒక్క స్థానం కూడా చేజారినట్టే..
సూరత్ జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండగా.. 2017 ఎన్నికల్లో కేవలం మాండ్వీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ గెలువగలిగింది. ఈసారి ఆ స్థానంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మేల్యే ఆనంద్ చౌదరీ ఓటమికి సమీపంలో ఉన్నారు. అక్కడ కూడా బీజేపీ అభ్యర్థి కువర్జీ హల్‍పతీ గెలవడం దాదాపు ఖాయమైంది.