Bhupendra Patel 2.0 Gujarat Cabinet: మంత్రులుగా 16 మంది ప్రమాణం.. ఒక్క మహిళే.. ఎవరామె?
Gujarat CM Bhupendra Patel’s New Cabinet: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‍తో పాటు మంత్రులుగా 16 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కొత్త క్యాబినెట్‍లో ప్రస్తుతం ఒకే ఒక్క మహిళకు చోటు దక్కింది.
Gujarat CM Bhupendra Patel’s New Cabinet: గుజరాత్‍లో వరుసగా ఏడోసారి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు భూపేంద్ర పటేల్. గాంధీనగర్‌లో నేడు జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‍నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం భూపేంద్ర పటేల్‍తో పాటు 16 మంది ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 16 మందితో కూడిన ఈ కొత్త క్యాబినెట్‍లో ఒకే ఒక్క మహిళ ఉండటం గమనార్హం. భూపేంద్ర పటేల్ 2.0 క్యాబినెట్‍లో ఎవరికి చోటు దక్కింది.. ఆ ఒక్క మహిళా మంత్రి ఎవరో ఇక్కడ చూడండి.
ప్రస్తుతానికి 16 మంది గుజరాత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఆరుగురికి క్యాబినెట్ హోదా ఉంది. అయితే త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం 16 మందిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు. ఆమే భానుబెన్ బాబరియా (Bhanuben Babariya).
గుజరాత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 16 మంది జాబితా ఇదే..
ఎమ్మెల్యే పేరు | నియోజకవర్గం |
బచ్చూభాయ్ ఖబడ్ | దేవ్‌గఢ్ బారియా |
పురుషోత్తమ్ సోలంకీ | భావ్‌నగర్ (రూరల్) |
హర్ష్ సంఘావి | మయురా |
జగదీశ్ విశ్వకర్మ | నికోల్ |
రుషికేష్ పటేల్ | విస్నగర్ |
రాఘవ్‍జీ పటేల్ | జామ్‌నగర్ (రూరల్) |
బల్వంత్‍సిన్హ్ రాజ్‌పుత్ | సిధ్పూర్ |
ముకేశ్‍భాయ్ జిన్నాభాయ్ పటేల్ | ఓల్పాడ్ |
కుర్వార్జీభాయ్ నర్శీభాయ్ హల్పతీ | మాండ్వీ (ఎస్‍టీ) |
కనూభాయ్ దేశాయ్ | పర్డీ |
కుర్వార్జీభాయ్ బలావియా | జస్దన్ |
డాక్టర్ కుబేర్ దిన్దోర్ | సంత్రామ్పూర్ (ఎస్‍టీ) |
భానుబెన్ బాబరియా | రాజ్‍కోట్ (రూరల్) (ఎస్‍సీ) |
ములుభాయ్ బేరా | ఖంబాలియా |
భికుభాయ్ ఛతుర్‍సిన్హ్ పర్మార్ | మొదాసా |
ప్రఫుల్ పన్సేరియా | కామ్రేజ్ |
భానుబెన్ బాబరియా ఎవరు?
భానుబెన్ బాబరియా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజ్‍కోట్ రూరల్ స్థానం నుంచి సమీప ఆప్ ప్రత్యర్థిపై 48,494 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2007, 2012లోనూ ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించిన భానుబెన్‍కు 2017 ఎన్నికల్లో అవకాశం దక్కలేదు. దీంతో రాజ్‍కోట్ మున్సిపల్ కార్పొరేషన్‍లో ప్రస్తుతం కౌన్సిలర్ గా ఉన్నారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ దక్కటంతో మరోసారి ఆమె విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా క్యాబినెట్‍లో మంత్రిగా చోటు దక్కించుకున్నారు భానుబెన్ బాబరియా.
కాగా, ఈనెల జరిగిన గుజరాత్ ఎన్నికల్లో 182 నియోజకవర్గాలకు గాను 156 స్థానాల్లో గెలిచి బీజేపీ వరుసగా ఏడోసారి అధికారాన్ని చేపట్టింది. ఇంతకు ముందెన్నడూ రాని సీట్లను ఈసారి సాధించింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కమలం పార్టీ మరింత బలోపేతమైంది.