Amit Shah on 2024 Lok Sabha Polls 2024: వచ్చే ఏడాది జరిగే లోక్‍సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party - BJP) విజయం ఖాయమని, మరోసారి తమ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) అన్నారు. నరేంద్ర మోదీ (Narendra Modi) మళ్లీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Elections) ఫలితాలే ఈ విషయాన్ని చెప్పేశాయని అమిత్ షా అన్నారు. గుజరాత్‍లోని 182 స్థానాల్లో బీజేపీ 156 సీట్లను సాధించి, వరుసగా ఏడోసారి అధికారం చేపట్టింది. దీన్ని గుర్తు చేసిన అమిత్ షా.. దేశంలో మళ్లీ బీజేపీ అధికారం తథ్యమని చెప్పారు. కాంగ్రెస్ (Congress), ఆమ్ఆద్మీ (Aam Admi) పార్టీలపై విమర్శలు చేశారు.
Amit Shah on 2024 Lok Sabha Polls 2024: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో లోక్‍సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలుస్తుందన్న సంకేతాలు దేశమంతా వచ్చేశాయని అమిత్ షా అన్నారు. గుజరాత్‍లోని గాంధీనగర్‌లో ఆదివారం జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడారు. “ఈసారి కాంగ్రెస్ వాళ్లు కొత్త లుక్‍తో వచ్చారు. ఇక ఢిల్లీ నుంచి మరికొందరు కొత్తవాళ్లు (ఆమ్ఆద్మీ) వచ్చారు. అయినా బీజేపీ భారీ విజయం సాధించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రానికి మాత్రమే ముఖ్యం కాదు.. దేశమంతా సందేశం ఇచ్చాయి. 2024లో కూడా నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి పదవి చేపడతారని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సందేశాన్ని ఇచ్చాయి” అని అమిత్ షా అన్నారు.
Union Home Minister Amit Shah: కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి అమిత్ షా. “కులతత్వపు విషాన్ని అంతమొందిచేందుకు గుజరాత్ ప్రజలు పని చేశారు. బూటకపు, తప్పుడు, ఆకర్షణీయమైన వాగ్దానాలను చేసిన వారిని తిరస్కరించారు. గుజరాత్, నరేంద్ర మోదీ ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్న వారికి ప్రజలు గుణపాఠం చెప్పారు” అని అమిత్ షా అన్నారు.
Gujarat Assembly Election Results: గతేడాది డిసెంబర్‌లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 182 సీట్లలో ఏకంగా 156 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. వరుసగా ఏడోసారి గుజరాత్‍లో అధికారాన్ని చేపట్టింది. కాంగ్రెస్ 17 స్థానాలకే పరిమితమైంది. ఇక తీవ్రమైన పోటీని ఇస్తుందని భావించిన ఆమ్‍ఆద్మీ 5 సీట్లలో గెలిచింది. దీంతో ప్రధాని మోదీ, అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‍లో బీజేపీ గత రికార్డులను చెరిపివేసింది. తొలిసారి 150 కంటే ఎక్కువ సీట్లను సాధించింది. 1995 నుంచి గుజరాత్‍లో కమలం పార్టీనే అధికారంలో ఉంది. ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఉన్నారు.