Bharat Rice: రిటైల్ మార్కెట్లో రూ.29కే భారత్ రైస్; విక్రయించనున్న ప్రభుత్వం-govt to sell bharat rice in retail market at 29 rupees a kg ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharat Rice: రిటైల్ మార్కెట్లో రూ.29కే భారత్ రైస్; విక్రయించనున్న ప్రభుత్వం

Bharat Rice: రిటైల్ మార్కెట్లో రూ.29కే భారత్ రైస్; విక్రయించనున్న ప్రభుత్వం

HT Telugu Desk HT Telugu
Feb 02, 2024 06:39 PM IST

Bharat Rice: నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ ద్వారా 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ లలో భారత్ రైస్ ను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి దశలో రిటైల్ మార్కెట్లో అమ్మకానికి 500,000 టన్నుల భారత్ రైస్ ను ప్రభుత్వం కేటాయించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

భారీ ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు వచ్చే వారం నుంచి భారత్ రైస్ రిటైల్ విక్రయాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ భారత్ రైస్ వచ్చే వారం నుంచి కిలో రూ.29 లకే లభిస్తాయి. ధరలను నియంత్రించడానికి అక్రమంగా, భారీగా బియ్యాన్ని నిల్వ చేయకూడదని ప్రభుత్వం వ్యాపారులను ఆదేశించింది.

రూ. 29 కే కేజీ బియ్యం..

‘‘వివిధ రకాలపై ఎగుమతి ఆంక్షలు ఉన్నప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే, బియ్యం రిటైల్ ధరలు 13.8%, హోల్సేల్ ధరలు 15.7% పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను నియంత్రించడానికి, సబ్సిడీలో ‘భారత్ రైస్’ ను వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో కిలోకు 29 రూపాయలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది" అని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.

5, 10 కిలోల ప్యాక్స్

నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సిసిఎఫ్), రిటైల్ చైన్ కేంద్రీయ భండార్ ద్వారా భారత్ రైస్ ను 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ లలో విక్రయించనున్నారు. మొదటి దశలో రిటైల్ మార్కెట్లో విక్రయించడానికి ప్రభుత్వం 500,000 టన్నుల ‘భారత్ రైస్’ బ్రాండ్ బియ్యాన్ని కేటాయించింది. ఇప్పటికే సబ్సీడీకి భారత్ అట్టా ను కిలో రూ.27.50, భారత్ పప్పు (శనగ)ను రూ.60కి ప్రభుత్వం విక్రయిస్తోంది.

అక్రమ నిల్వలుంటే కేసులు

బియ్యం నిల్వల వెల్లడికి సంబంధించి, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని వ్యాపారులు, హోల్సేల్ వ్యాపారులు, రిటైలర్లు, ప్రాసెసర్లు లేదా మిల్లర్లు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు, తమ వద్ద ఉన్న ఆహార ధాన్యాల నిల్వ స్థితిని ప్రకటించాలని చోప్రా అన్నారు. అన్ని బియ్యం కేటగిరీల స్టాక్ పొజిషన్ - బ్రోకెన్ రైస్, నాన్ బాస్మతి వైట్ రైస్, పార్బాయిల్డ్ రైస్, బాస్మతి బియ్యం నిల్వ వివరాలను ప్రతి వారం ఆహార, ప్రజా పంపిణీ శాఖ పోర్టల్లో ప్రకటించాల్సి ఉంటుంది. దేశీయంగా ధరలు స్థిరపడే వరకు బియ్యం ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేసే యోచన ప్రభుత్వానికి లేదని చోప్రా తెలిపారు.

మిగతావి ఓకే..

ప్రభుత్వం బియ్యంపై నిల్వ పరిమితిని విధిస్తుందా అని అడిగినప్పుడు, "అలాంటి ప్రణాళిక వెంటనే లేదు. స్టాక్ పొజిషన్ సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, ధరలను తగ్గించడానికి అన్ని మార్గాలు తెరిచే ఉన్నాయి. బియ్యం మినహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉన్నాయి’’ అని చోప్రా చెప్పారు. గోధుమల నిర్వహణకు సంబంధించి, లభ్యత, ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం వారాంతపు ఇ-వేలం ద్వారా స్టాక్ ను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. మొత్తం 10.1 మిలియన్ టన్నులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 7.5 మిలియన్ టన్నులు ఇప్పటికే బహిరంగ మార్కెట్ అమ్మకం పథకం (ఒఎంఎస్ఎస్) కింద విక్రయించారు’ అని వివరించారు.

IPL_Entry_Point