వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టిన అదానీ.. ఆ జాబితాలో 5వ స్థానం..!
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగింది. ఫలితంగా.. ప్రపంచ కుబేరుల జాబితాలో 5వ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్‌ను ఆయన వెనక్కి నెట్టేశారు. అంతేకాకుండా.. ఇండియాలోని కుబేరుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు.
Gautam Adani net worth | దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను అధిగమిస్తూ.. ప్రపంచ కుబేరుల జాబితాలో 5వ స్థానాన్ని దక్కించుకున్నారు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. 59ఏళ్ల అదానీ వ్యాపారాల విలువ 123.7బిలియన్ డాలర్లకు చేరింది(శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి). కాగా బఫెట్ ఆస్తుల విలువ 121.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతేకాకుండా.. 123.7బిలియన్ డాలర్లతో.. భారత దేశంలోనే ధనికుడిగా నిలిచారు అదానీ.
ఒక్క 2022లోనే ఇప్పటివరకు 43బిలియన్ డాలర్లను తన సంపదలో యాడ్ చేసుకున్నారు అదానీ. ఆయన పోర్ట్‌ఫోలియో 56.2శాతం పెరిగింది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ కంటే ముందు బిల్ గేట్స్(130.2 బిలియన్ డాలర్లు), బెర్నాండ్ ఆర్నాల్ట్(167.9 బిలియన్ డాలర్లు), జెఫ్ బెజేజో(170.2 బిలియన్ డాలర్లు), ఎలాన్ మస్క్(269.7 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
అదానీ సంస్థకు ఎయిర్‌పోర్టు నుంచి ఓడరేవుల వరకు అనేక వ్యాపారాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్ పంపిణీలో సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆదానీకి చెందిన ఆరు సంస్థలు.. ఇండియా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉన్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థపై అదానీ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. 2050 నాటికి దేశం 30ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరిస్తుందని అంచనా వేశారు. ఇదే జరిగితే.. ఆకలితో ఒక్కరు కూడా అలమటించరని పేర్కొన్నారు. పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
సంబంధిత కథనం
టాపిక్