Amarinder Singh to join BJP: అమరీందర్ సింగ్ బీజేపీకి.. వచ్చే వారం పార్టీ విలీనం
Amarinder Singh to join BJP: కాంగ్రెస్‌ను వీడిన అనంతరం పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వచ్చే వారం తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (PLC)ని విలీనం చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.
సెప్టెంబరు 19న విలీనం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి. తేదీని ఇంకా ధృవీకరించలేదని కెప్టెన్ సీనియర్ సహాయకుడు తెలిపారు. అయితే కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరడం ఖాయమని అన్నారు.
సెప్టెంబర్ 18న న్యూఢిల్లీకి వెళ్లనున్న 80 ఏళ్ల కెప్టెన్ ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ గత సెప్టెంబరులో ముఖ్యమంత్రి పదవి నుంచి అనూహ్యంగా నిష్క్రమించాల్సి వచ్చాక, కాంగ్రెస్ నుంచి విడిపోయారు. తరువాత కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ ప్రారంభించారు. ఫిబ్రవరి 2022 ఎన్నికల వరకు చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన ఆ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్, చన్నీ ఇద్దరూ ఓడిపోయారు.
పీఎల్‌సీకి NOTA కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో పీఎల్‌సీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది కానీ ఫలితం లేకపోయింది.
మాజీ ముఖ్యమంత్రితో పాటు కొందరు మాజీ ఎమ్మెల్యేలు సహా ఆరుగురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరనున్నారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ 2002-07, 2017-21 మధ్య రెండు పర్యాయాలు పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అతను తన రెండో పదవీకాలాన్ని పూర్తి చేయడానికి కేవలం నాలుగు నెలల ముందు సెప్టెంబర్ 2021లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.