Terrorists killed: కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్; ఐదుగురు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లో భద్రతాదళాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
జమ్మూకశ్మీర్లో భద్రతాదళాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సంవత్సరం పాకిస్తాన్ వైపు నుంచి కుప్వారా సెక్టార్ వైపు ఇదే తొలి భారీ ఉగ్రవాదుల చొరబాటుగా భావిస్తున్నారు.
ఐదుగురు ‘విదేశీ’ ఉగ్రవాదులు
జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల సంచారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న భద్రత దళాలు, స్థానిక పోలీసులతో కలిసి శుక్రవారం తెల్లవారు జాము నుంచి ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించాయి. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో వారికి ఉగ్రవాదులు తారసపడ్డారు. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో ఐదుగురు టెర్రరిస్ట్ లు హతమయ్యారు. ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ వివరాలను కశ్మీర్ డీజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఎన్ కౌంటర్ లో హతమైన ఉగ్రవాదులు విదేశీయులను ఆయన వెల్లడించారు. జూన్ 13వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రత దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. కుప్వారా జిల్లా సరిహద్దుల్లో, నియంత్రణ రేఖ సమీపంలో దోబనార్ మచ్చల్ ప్రాంతంలో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.