Kota suicide: కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య; అది హత్య అంటున్న ఆ విద్యార్థి తల్లిదండ్రులు
Kota suicide: రాజస్తాన్ లోని కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, హత్య అని అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Kota suicide: వైద్య విద్య లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష శిక్షణ కోసం రాజస్తాన్ లోని కోటకు వచ్చిన ఉత్తర ప్రదేశ్ విద్యార్థి ఆత్మ హత్య చేసుకున్నాడు. కోటలో తను ఉంటున్న హాస్టల్ గదిలో విగత జీవిగా కనిపించాడు. అతడి ముఖంపై ప్లాస్టిక్ బ్యాగ్ కట్టి ఉంది. చేతులు రెండు వెనక్కు విరిచి కట్టి ఉన్నాయి.
నాలుగు నెలల క్రితమే..
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఆ విద్యార్థి నాలుగు నెలల క్రితం తన మరో ముగ్గురు స్కూల్ ఫ్రెండ్స్ తో కలిసి నీట్ కోచింగ్ కోసం కోట వచ్చాడు. బుధవారం కోచింగ్ నుంచి వచ్చిన తరువాత తన రూమ్ లోకి వెళ్లి లోపలి నుంచి గడియ వేసుకున్నాడు. మర్నాడు రూమ్ డోర్ తీయకపోవడంతో, హాస్టల్ నిర్వాహకులు, ఇతర విద్యార్థులతో కలిసి చూడగా చనిపోయి కనిపించాడు. దాంతో, హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ విద్యార్థి ముఖంపై, ఊపిరి తీసుకోవడానికి వీల్లేకుండా ప్లాస్టిక్ బ్యాగ్ గట్టిగా కట్టి ఉంది. చేతులు రెండు వెనక్కు విరిచి కట్టి ఉన్నాయి. మృతదేహం పక్కన సూయిసైడ్ నోట్ కనిపించింది. అందులో తన మరణానికి ఎవరూ బాధ్యులు కాదు అని రాసి ఉంది.
ఆత్మ హత్య కాదు .. హత్య
ఈ వార్త తెలిసి ఉత్తర ప్రదేశ్ నుంచి ఆ విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వచ్చారు. తమ కుమారుడిది ఆత్మహత్య కాదని, అది హత్యేనని వారు ఆరోపించారు. మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. ‘‘నా కుమారుడిది ముమ్మాటికి హత్యే. చేతులు వెనక్కు విరిచి కట్టేసి ఉన్నాయి. ముఖంపై ప్లాస్టిక్ బ్యాగ్ కట్టి ఉంది. ఆత్మహత్య ఇలా ఎవరూ చేసుకోరు’’ అని ఆ విద్యార్థి తండ్రి ఆరోపిస్తున్నారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతడికి 12వ తరగతిలో 95% మార్కులు వచ్చాయని, అతడు స్కూల్ టాపర్ అని వివరిస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం ప్రాథమికంగా దీన్ని ఆత్మహత్యగానే భావిస్తున్నారు.