Musk cuts twitter workforce: ట్విటర్‌లో సగం ఉద్యోగాల కోత.. నో వర్క్ ఫ్రమ్ హోం
Musk cuts twitter workforce: ట్విటర్ సగం ఉద్యోగులను తొలగించడమే కాకుండా, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలసీని రద్దు చేస్తోంది.
కంపెనీ వ్యయాలను తగ్గించే చర్యల్లో భాగంగా ట్విటర్ అధినేత ఇలాన్ మస్క్ 3,700 ఉద్యోగులను (దాదాపు సగం మంది ఉద్యోగులు) తొలగించేందుకు నిర్ణయించినట్టు బ్లూమ్‌బెర్గ్ ఏజెన్సీ తెలిపింది. ట్విటర్ కొత్త బాస్ రేపు నవంబరు 4న ఈ నిర్ణయాన్ని తన ఉద్యోగులకు చెప్పనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న వర్క్ ఫ్రమ్ ఎనీ వేర్ పాలసీకి కూడా స్వస్తిపలుకుతూ ఉద్యోగులు అందరూ ఆఫీస్‌కు రావాల్సిందిగా సూచించనున్నట్టు సమాచారం. అయితే కొన్ని మినహాయింపులు కూడా ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఏప్రిల్‌లో మార్కెట్ల పతనం ప్రారంభమవుతున్న సమయంలో షేరుకు 54.20 డాలర్ల చొప్పున చెల్లించి ట్విటర్‌ను కొనుగోలు చేయాలని ఇలాన్ మస్క్ యోచించారు. అయితే ట్విటర్ సంస్థ బోగస్ ఖాతాలను గణాంకాల్లో చూపి తనను మోసగించిందని మస్క్ ఆరోపించడంతో ఆ లావాదేవీ పూర్తికావడంలో జాప్యం జరిగింది. అయితే ట్విటర్ ఈ వివాదంపై కోర్టుకెక్కింది.
ట్విటర్ కంపెనీ తన చేతుల్లోకి వచ్చిన తరువాత గత వారం మస్క్ మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం మేర తొలగించాలని సీనియర్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఆదేశించినట్టు సమాచారం. ట్విటర్ నియమావళికి అనుగుణంగా ఉన్న పనితీరు ఆధారంగా తొలగించాల్సిన వారి జాబితాను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ జాబితాను టెస్లా డైరెక్టర్లు, ఇంజినీర్లు పరిశీలించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో తుది నిమిషంలో ఇంకా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను అనుసరించేందుకు మస్క్ సలహాదారుల బృందం పలు సలహాలు ఇచ్చింది. ఉద్యోగం కోల్పోయిన వారికి రెండు నెలల వేతనం పరిహారంగా చెల్లించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇలాన్ మస్క్ ట్విటర్ పగ్గాలు చేపట్టాక టాప్ మేనేజ్మెంట్ టీమ్‌లో సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురిని తొలగించారు. డైరెక్టర్లను కూడా తొలగించారు.