Election Commissioner Arun Goel: ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా; లోక్ సభ ఎన్నికల ముందు సంచలన నిర్ణయం
Election Commissioner Arun Goel resigns: ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొన్ని రోజుల ముందు ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అరుణ్ గోయల్ రాజీనామాకు కారణాలు తెలియరాలేదు.
Arun Goel resigns: 2024 లోక్ సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ (Election Commissioner Arun Goel) రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించగా, ఆమె అరుణ్ గోయల్ రాజీనామాను ఆమోదించారు. ఎన్నికల సంఘానికి ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ (రాజీవ్ కుమార్) మాత్రమే నేతృత్వం వహిస్తారు తప్ప ఎన్నికల కమిషనర్లు లేరు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సర్వీసు నిబంధనలు, పదవీకాలం) చట్టం 2023లోని సెక్షన్ 11లోని క్లాజ్ (1)కు అనుగుణంగా 2024 మార్చి 9 నుంచి ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదిస్తున్నట్లు శనివారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
2022 నుంచి..
అరుణ్ గోయల్ 2022 నవంబర్ 21న ఎన్నికల కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమిషనర్ ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్ గతంలో భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అరుణ్ గోయల్ రాజీనామాకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఎన్నికల సమయంలో..
లోక్ సభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న సమయంలో అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఏప్రిల్- మే నెలల్లో జరిగే ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్ బృందాలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పటికీ, ప్రస్తుతానికైతే, ఎన్నికల తేదీలను ఇంకా ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా భద్రతా సిబ్బంది మోహరింపు, తరలింపుపై కేంద్ర హోంశాఖ, రైల్వే అధికారులతో ఎన్నికల సంఘం శుక్రవారం భద్రతా సమావేశం నిర్వహించింది.
అసెంబ్లీ సమావేశాలు కూడా..
అత్యంత ప్రతిష్టాత్మకమైన లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలను కూడా 2024 లో ఒకే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్వహించాల్సి ఉంటుంది. 2019 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఓట్ల లెక్కింపు జరిపి, ఫలితాలను ప్రకటించారు.