Indonesia Earthquake: ఇండోనేషియాలో భీకర భూకంపం.. పదుల సంఖ్యలో మృతులు!
Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ప్రాథమిక సమాచారం మేరకు.. ఈ దుర్ఘటనలో 46 మంది మృతి చెందారని అక్కడి అధికారులు వెల్లడించారు.
Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. జావా ఐల్యాండ్‍లో సోమవారం ఈ దుర్ఘటన జరిగింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదైనట్టు సమాచారం. ఈ ఘటనలో ఇప్పటి వరకు 46 మంది మృతి చెందగా.. వందలాది మంది గాయపడినట్టు ఇండోనేషియా అధికార వర్గాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి.
వెస్ట్ జావా ప్రావిన్స్ లోని చియాంజూర్ (Cianjur) ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
“చియాంజూర్ రీజనల్ ఆసుపత్రిలో 46 మృతదేహాలు ఉన్నాయి. 700 మందికిపైగా గాయాలపాలయ్యారు. భవనాలు కూలిపోవడంతోనే ఎక్కువ మంది గాయాలపాలయ్యారు” అని నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ చీఫ్ సుహార్యంటో వెల్లడించారు. సియాంజూర్ ప్రాంతంలో వందలాది భవనాలు ఈ భూపంకం కారణంగా కూలిపోయాయని తెలిస్తోంది.
Indonesia Earthquake: శిథిలాల కింద మరికొంత మంది!
భూకంప ప్రభావంతో జావా ఐల్యాండ్‍లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని భవనాలు కూలినట్టు సమాచారం అందుతోంది. “భవనాల శిథిలాల కింద పడే ఎక్కువ మందికి గాయాలయ్యాయి. బాధితుల బంధువులు నగరంలోని సయాంగ్ ఆసుపత్రి వద్ద గుమికూడారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది” అని ఆ అధికారి అక్కడి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం అత్యవసర చికిత్స అవసరమైన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నామని, చాలా ఆంబులెన్స్ లు వస్తున్నాయని అన్నారు.
మరోవైపు ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలని ఆ దేశ మెట్రోలాజికల్ ఏజెన్సీ ప్రజలను హెచ్చరిస్తోంది. ఇంకా భవనాలు కూలే ప్రమాదం ఉందని చెబుతోంది. “ప్రజలు భవనాల బయటే ఉండాలని తెలియజేస్తున్నాం” అని వెల్లడించింది.
మరోవైపు ఇండోనేషియా రాజధాని జకార్తలోనూ భూకంప ప్రభావం కనిపించినా.. అక్కడ ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రజలు భారీ సంఖ్యలో భవనాల నుంచి బయటికి పరుగులు పెట్టారు.
గత సంవత్సరం జనవరిలో ఇండోనేషియాలోని సులావెసి ఐల్యాండ్‍లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు 100 మందికిపైగా మృతి చెందగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇండోనేషియాలో భూకంపం సంభవించింది.
టాపిక్