Donald Trump indicted : ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. రహస్య పత్రాల కేసులో అభియోగాలు!
Donald Trump indicted : రహస్య పత్రాల కేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభియోగాలు మోపారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
Donald Trump indicted : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కష్టకాలం కొనసాగుతోంది! 'పోర్న్ స్టార్' కేసులో ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు తాజాగా మరో షాక్ తగిలింది. రహస్య పత్రాల కేసులో తనపై అభియోగాలు మోపినట్టు స్వయంగా ట్రంప్ వెల్లడించారు. 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికెన్ పార్టీ తరఫున ప్రధాన అభ్యర్థిగా దూసుకెళుతున్న తరుణంలో క్రిమినల్ కేసులు ట్రంప్‌ను వెంటాడుతుండటం సర్వత్రా చర్చలకు దారితీసింది.
పేపర్ల మధ్యలో రహస్య పత్రాలు..!
2020 ఎన్నికల ఓటమి తర్వాత.. వైట్ హౌజ్‌ను ట్రంప్ ఖాళీ చేశారు. అయినప్పటికీ ఆయన వద్ద ప్రభుత్వానికి చెందిన క్లాసిఫైడ్ డాక్యుమెంట్లు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది ఆగస్టులో ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసమైన మార్- ఎ- లాగో ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. దేశానికి చెందిన అత్యంత రహస్యమైన పత్రాలను ఇతర మ్యాగజైన్లు, వార్తా పత్రికల మధ్య కలిపేశారని అధికారులు వెల్లడించారు.
తాజా పరిణామాలపై తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందించారు డొనాల్డ్ ట్రంప్.
"ఈ అవినీతి బైడెన్ ప్రభుత్వం.. నాపై మళ్లీ అభియోగాలు మోపింది. ఈ విషయం నా లాయర్లకు చెప్పింది. ఓ మాజీ అధ్యక్షుడికి.. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు," అని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మయామీలోని ఫెడరల్ కోర్టు హాజరుకావాలని తనకు పిలుపు వచ్చిందని వివరించారు. ఇదే నిజమైతే.. ఫెడరల్ ఛార్జీలు ఎదుర్కొనున్న తొలి సిట్టింగ్/ మాజీ కమాండర్ ఇన్ చీఫ్‌గా ట్రంప్.. అమెరికా చరిత్రలో నిలిచిపోనున్నారు.
ఈ విషయంపై అమెరికా న్యాయశాఖ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లభించలేదు. కాగా ఈ వార్త నిజమేనని అమెరికాలోని కొన్ని ప్రముఖ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే.. ట్రంప్‌పై ఎలాంటి ఛార్జీలు వేస్తున్నారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
కాగా.. మరో వారం రోజుల్లో 77ఏళ్ల వసంతంలోకి అడుగుపెట్టనున్న ట్రంప్ మాత్రం.. తాను ఎలాంటి తప్పులు చేయలేదని తేల్చిచెబుతున్నారు.
"రహస్య పత్రాల గురించి నాకేం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే. నేనే తప్పుచేయలేదు," అని ఇటీవలే ఓ కార్యక్రమంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
కేసులే.. కేసులు..
Donald Trump classified documents case : హష్ మనీ కేసులో ట్రంప్‌పై అభియోగాలు ఉన్నాయి. రహస్య పత్రాల కేసులో ఆయనపై తాజాగా అభియోగాలు మోపారు. 2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో జరిగిన క్యాపిటల్ హింసాకాండ కేసులోనూ ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. వీటితో పాటు 10కిపైగా ఆర్థికపరమైన నేరాలకు సంబంధించిన కేసులు ట్రంప్‌పై ఉన్నాయి.
సంబంధిత కథనం