Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్, విడుదల.. పోర్న్ స్టార్‌కు డబ్బులిచ్చిన కేసు సహా 34 నేరారోపణలు-donald trump arrested at new york court in porn star payment case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్, విడుదల.. పోర్న్ స్టార్‌కు డబ్బులిచ్చిన కేసు సహా 34 నేరారోపణలు

Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్, విడుదల.. పోర్న్ స్టార్‌కు డబ్బులిచ్చిన కేసు సహా 34 నేరారోపణలు

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 05, 2023 05:42 AM IST

Donald Trump Arrested: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. పోర్న్ స్టార్‌కు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చిన కేసు(Hush Money)లో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. మొత్తంగా 34 నేరారోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. అయితే, కోర్టు ఆయనను కస్టడీ నుంచి విడుదల చేసింది.

Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్..  విడుదల
Trump Arrested: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. విడుదల (AP)

Donald Trump Arrested: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యారు. మంగళవారం న్యూయార్క్ కోర్టు(New York Court)కు ట్రంప్ చేరుకోగా, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన మ్యాన్‍హాటన్ కోర్టు రూమ్‍కు వెళ్లారు. తనపై మోపిన నేరారోపణలపై విచారణకు హాజరయ్యారు. ప్రపంచానికి పెద్దన్నగా భావించే అమెరికా చరిత్రలో ఇది కీలక పరిణామంగా మారింది. రాజకీయ సంచలనాన్ని రేపింది. అమెరికా అధ్యక్షుడిగా పని చేసి నేరారోపణలు ఎదుర్కొన్న తొలి వ్యక్తిగా ట్రంప్ చరిత్రకెక్కారు. లైంగిక సంబంధం విషయం వెల్లడించవద్దని 2016లో పోర్న్ స్టార్‌ స్టార్మీ డేనియల్స్ (Stormy Daniels)కు డొనాల్డ్ ట్రంప్ భారీగా డబ్బు ఇచ్చారన్నది ప్రధాన అభియోగంగా ఉంది. ఈ హష్‍మనీ (Hush Money) కేసులో న్యూయార్క్‌లోని మానహాటన్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్‍పై అభియోగాలను మోపింది. దీంతో అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రోజున ట్రంప్ లొంగిపోయారు. ఈ హష్‍మనీ, వ్యాపార అవకతవకలు, ఎన్నికల ఖర్చు సహా ట్రంప్‍పై మొత్తంగా 34 నేరాలు నమోదయ్యాయి. అయితే, ఈ నేరారోపణలను ఆయన అంగీకరించలేదు. వాదనల అనంతరం కస్టడీ నుంచి ఆయనను కోర్టు విడుదల చేసింది. వివరాలివే..

Donald Trump Arrested: ట్రంప్ వచ్చిన సమయంలో ఆయన మద్దతుదారులు కోర్టుకు బయట వేలాదిగా చేరుకున్నారు. ఆందోళన చేశారు. 2024లో మరోసారి అమెరికా అధ్యక్ష బరిలో ఉందామని ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్‍నకు ఈ అరెస్టు, నేరారోపణలు తీవ్ర ఆటంకంగా మారాయి. ఇవి రుజువైతే మళ్లీ ప్రెసిడెంట్ కావాలన్న ఆయన ఆశలు నెరవేరవు. ఇప్పటికే ట్రంప్ ఉన్న రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి తీవ్రమైన పోటీ ఉంది. ఇక ఇప్పుడు ఈ నేరారోపణల ఉదంతంతో ట్రంప్‍కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్ష పోటీకి ఆయనకు అభ్యర్థిత్వం దక్కడం కూడా కష్టంగానే మారే ఛాన్స్ ఉంది.

విడుదల

Donald Trump Arrested: అరెస్ట్ అనంతరం.. మ్యాన్‍హాటన్ కోర్టులో ట్రంప్‍పై నేరారోపణలను జడ్జి వినిపించారు. నమోదైన 34 నేరాలను ట్రంప్ అంగీకరించలేదు. ట్రంప్‍పై వచ్చిన ఆరోపణలన్నీ కుట్రపూరితమైనవని ఆయన తరఫున న్యాయవాది వాదించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. వాదనల తర్వాత ట్రంప్‍ను కస్టడీ నుంచి విడుదల చేశారు జడ్జి జువాన్ మర్చన్. అయితే, అభియోగాలపై విచారణ కొనసాగనుంది. ఇక కోర్టు బయట ఏమీ మాట్లాడకుండానే తిరిగి ఫ్లోరిడా వెళ్లిపోయారు ట్రంప్. ఫ్లోరిడాలో బుధవారం రోజున భారీ సభ నిర్వహించే అవకాశం ఉంది.

ఇదీ కేసు

Donald Trump Hush Money Case: 2006లో తనతో డొనాల్డ్ ట్రంప్ శృంగారంలో పాల్గొన్నారని స్మార్టీ డేనియల్స్ అనే పోర్న్ స్టార్ గతంలో వెల్లడించారు. ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా రహస్యంగా ఉంచాలని 2016 అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ న్యాయవాది మైకేల్ కొహెన్ తనకు 1,30,000 డాలర్లు ఇచ్చి ప్రలోభపెట్టారని ఆమె వెల్లడించారు. ఈ విషయాన్ని 2019లో కొహెన్ కూడా అంగీకరించారు. అమెరికన్ కాంగ్రెస్ ఎదుట ఈ విషయంపై వివరాలను వెల్లడించారు. పోర్న్ స్టార్‌కు ట్రంప్ తరఫున డబ్బు ఇచ్చినట్టు అంగీకరించారు.

Donald Trump Arrested: దీంతో, డొనాల్డ్ ట్రంప్‍పై వచ్చిన ఈ హష్‍మనీ ఆరోపణలను మ్యాన్‍హాటన్ కోర్టుకు సంబంధించిన ప్యానెల్ విచారించింది. సాక్షులను ప్రశ్నించి.. ట్రంప్‍ తప్పు చేశారనే నిర్ణయానికి వచ్చి అభియోగాలను మోపింది. సీల్డు కవర్లో 34 నేరారోపణలను పొందుపరిచింది. దీన్ని ట్రంప్ ఎదుటే కోర్టు వినిపించింది. అయితే ఈ నేరాలను ఆయన అంగీకరించలేదు. కాగా, నేరారోపణలతో అరెస్టయిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు.

కాగా, తాను అరెస్టవుతానంటూ కొన్ని రోజుల క్రితమే తన సొంత సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్ ట్రూత్‍ సోషల్‍లో ట్రంప్ పోస్ట్ చేశారు. తనకు ఇది నమ్మశక్యం కాని విషయంగా ఉందని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, రాజకీయ కక్షసాధింపులో భాగమే ఇది అని ఆరోపించారు.

కాగా, ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిపోయాక 2021 జనవరిలో ఆయన మద్దతుదారులు అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి చేశారు. హింసకు పాల్పడ్డారు. ట్రంప్ రెచ్చగొట్టిన కారణంగానే నిరసనలు, దాడి జరిగాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం