PM Modi in Ujjain: ‘దేవదేవుడి సన్నిధిలో ప్రతీది అద్భుతమే’
PM Modi in Ujjain: భారత్ లోని జ్యోతిర్లింగ క్షేత్రాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశ సాంస్కృతిక వైభవం పరిఢవిల్లుతుందని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్ లో పర్యటించారు. ఉజ్జయిన్ లో రూ. 850 కోట్లతో రూపొందుతున్న మహాకాల్ లోక్ ప్రాజెక్ట్ ఫేజ్ 1ను ప్రారంభించారు.
PM Modi in Ujjain: భౌగోళికంగానే కాదు..
భారతదేశంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ భౌగోళికంగానే కాదు, సాంస్కృతిక వారసత్వం విషయంలోనూ కేంద్రంగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. జ్యోతిర్లింగ క్షేత్రాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశ సాంస్కృతిక వైభవాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నామన్నారు. మహాకాల్ లోక్ అత్యంత వైభవోపేతంగా ఉందన్నారు. సర్వతోముఖ అభివృద్ధికి దేశం సాంస్కృతికంగా అత్యున్నత శిఖరాలకు చేరడం అవసరమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
PM Modi in Ujjain: శివుడి సన్నిధిలో అన్నీ అసాధారణమే..
దేవదేవుడి సన్నిధిలో ప్రతీది అద్భుతం, అనిర్వచనీయం, అసాధారణమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వేల సంవత్సరాలుగా ఉజ్జయిన్ దేశ సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లిందన్నారు. ఉజ్జయిన్ వ్యాప్తంగా ఆధ్యాత్మికత విస్తరించి ఉందన్నారు.
PM Modi in Ujjain: అన్ని క్షేత్రాల అభివృద్ధి
తాము అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోని అన్ని సాంస్కృతిక, ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. చార్ ధామ్ యాత్రకు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించగల రహదారులను సిద్ధం చేస్తున్నామని వివరించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు.