Agnipath Scheme: అగ్నిపథ్ పథకంపై ఢిల్లీ హైకోర్టు తీర్పు.. “దేశ ప్రయోజనం కోసమే..”
Agnipath Scheme: అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తుదితీర్పు వెలువరించింది. అగ్నిపథ్ పథకంలో జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది.
Agnipath Scheme: త్రివిధ దళాల్లో (Armed Forces) స్వల్పకాలిక నిమాయకం కోసం కేంద్రం తెచ్చిన “అగ్నిపథ్” పథకాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కొట్టేసింది. అగ్నిపథ్ పథకం దేశ ప్రయోజనాల కోసం తీసుకొచ్చిందని, దీని వల్ల దేశ సాయుధ దళాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని దాఖలైన పలు పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్‍తో కూడిన ధర్మాసనం విచారించింది. ఆ పిటిషన్లను కొట్టేసింది. రక్షణ దళాల్లో నియామకాలకు పాత విధానాన్ని మాత్రమే కొనసాగించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇలా అడిగే హక్కు ఎవరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అగ్నిపథ్ పథకం కొనసాగుతుందని న్యాయస్థానం వెల్లడించింది.
జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు
Agnipath Scheme: అగ్నిపథ్ పథకం విషయంలో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదని ఢిల్లీ హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. “పథకంలో జోక్యం చేసుకునేందుకు ఏ కారణం కూడా కోర్టుకు కనిపించడం లేదు. అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేస్తున్నాం” అని కోర్టు తన తీర్పును వెల్లడించింది.
అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చింది. ఈ పథకానికి 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న ఉన్న వారు అర్హులు. సాయుధ దళాల్లో నాలుగు సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించేందుకు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సులో పోస్టింగ్ పొందవచ్చు. నాలుగు సంవత్సరాల సర్వీస్ తర్వాత 25 శాతం మంది పర్మినెంట్ అవుతారు. మిగిలిన 75 శాతం తర్వాత బయటికి రావాల్సి ఉంటుంది. వారికి వివిధ నియామకాల్లో ప్రత్యేక కోటా ఉంటుంది. అయితే సాయుధ దళాల్లో ఈ స్వల్ప కాలిక నియామకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కొన్ని రాష్ట్రాల్లో నిరసనలు హింసాత్మకం కూడా అయ్యాయి.
Agnipath Scheme: అగ్నిపథ్ పథకాన్ని ఆపేయాలంటే గతేడాది పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సుప్రీం కోర్టు.. ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. కేరళ, హర్యానాతో పాటు మరిన్ని హైకోర్టులను కూడా ఢిల్లీ న్యాయస్థానానికి పిటిషన్లను ట్రాన్స్‌ఫర్ చేయాలని, లేకపోతే తీర్పును పెండింగ్‍లో ఉంచాలని సూచించింది. అగ్నిపథ్‍ను నిలుపదల చేసేందుకు తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్ల విచారణను గతేడాది ఆగస్టులో ప్రారంభించింది.
Agnipath Scheme: ఆర్మీలో యువత శాతాన్ని పెంచేందుకు, దేశ సాయుద దళాల బలోపేతానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కోర్టులో వాదనలు వినిపించింది కేంద్ర ప్రభుత్వం. విచారణను పూర్తి చేసిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం డిసెంబర్ 15న తీర్పు ప్రకటనను వాయిదా వేసింది. ఇప్పుడు తుది తీర్పు వెలువరించింది. అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేసింది.
సంబంధిత కథనం