Nude video leaks: ముగిసిన చండీగఢ్ వర్శిటీ విద్యార్థినుల నిరసన
Nude video leaks: చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థుల నిరసన ప్రదర్శన సోమవారం తెల్లవారుజామున ముగిసింది.
చండీగఢ్, సెప్టెంబర్ 19: పంజాబ్ రాష్ట్రం మొహాలిలోని చండీగఢ్ యూనివర్శిటీలో పలువురు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు రికార్డయ్యాయన్న ఆరోపణలపై న్యాయమైన, పారదర్శకంగా విచారణ జరిపిస్తామని జిల్లా యంత్రాంగం, పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు సోమవారం తెల్లవారుజామున తమ నిరసనను ముగించారు.
నిర్లక్ష్యానికి పాల్పడినందుకు ఇద్దరు వార్డెన్‌లను సోమవారం యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 24 వరకు "నాన్ టీచింగ్ డేస్" గా ప్రకటించింది.
అంతేకాకుండా, హాస్టల్ సమయాలు, విద్యార్థుల ఇతర డిమాండ్‌లకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులతో కూడిన జాయింట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.
"విద్యార్థులు తెల్లవారుజామున తమ నిరసనను ముగించారు..’ అని మొహాలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ షీల్ సోనీ తెలిపారు. ఈ కేసును విచారించేందుకు సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన విలేకరులకు తెలిపారు.
"మేం ఎల్లప్పుడూ మా విద్యార్థులకు అండగా ఉంటాం. వారి విద్యా ఆకాంక్షలు, వారి భద్రత, శ్రేయస్సు విషయంలో అన్ని చర్యలూ తీసుకుంటాం..’ అని యూనివర్శిటీ ఓ ట్వీట్ చేసింది.
పలువురు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలను సహచర విద్యార్థిని రికార్డు చేశారన్న ఆరోపణలపై శనివారం రాత్రి క్యాంపస్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. వీడియోలు కూడా లీక్ అయ్యాయని కొందరు విద్యార్థులు ఆరోపించారు.
అయితే సదరు మహిళా విద్యార్థి తన బాయ్‌ఫ్రెండ్ అని పేర్కొన్న 23 ఏళ్ల యువకుడితో తనకు సంబంధించిన వీడియోను మాత్రమే పంచుకున్నట్లు తేలిందని, మరే ఇతర విద్యార్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియో లేదని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
ఆ వ్యక్తిని హిమాచల్ ప్రదేశ్‌లో అదుపులోకి తీసుకుని పంజాబ్ పోలీసులకు అప్పగించారు. ఇక సదరు విద్యార్థిని పంజాబ్‌లోనే అరెస్టు చేశారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం ఆ మహిళ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఏ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయలేదని అధికారులు తెలిపారు.
హాస్టల్‌లోని అనేక మంది మహిళా విద్యార్థుల వీడియోలు చిత్రించి సోషల్ మీడియాలో లీక్ చేశారని, మనస్తాపం చెందిన విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్న "తప్పుడు, నిరాధార" నివేదికలను విశ్వవిద్యాలయ అధికారులు ఖండించారు.
అయితే యూనివర్సిటీ అధికారులు "వాస్తవాలను అణచివేస్తున్నారని" ఆరోపిస్తూ విద్యార్థులు ఆదివారం సాయంత్రం తాజా నిరసనను నిర్వహించారు. ఇది అర్థరాత్రి వరకు కొనసాగింది.
ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 354-సి (రహస్యంగా చిత్రీకరణ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదైందని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.