Opposition Leaders statement: కేంద్రం ప్రతీకార చర్యలకు పాల్పడుతోందన్ని అపోజిషన్
ఈడీ ముందు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరుకానున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశాయి.
న్యూఢిల్లీ, జూలై 21: దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై కఠినమైన ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ని మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు ‘ప్రజా వ్యతిరేక మోదీ సర్కార్’పై తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.
మునుపెన్నడూ లేని విధంగా అనేక రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
‘మోదీ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. అనేక రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని ఇంతకుముందు ఎన్నడూలేని రీతిలో వేధింపులకు గురిచేస్తున్నారు’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.
‘మేం దీనిని ఖండిస్తున్నాం. మన సమాజం సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తున్న మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మా సమిష్టి పోరాటాన్ని కొనసాగించాలని, తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నాం..’ అని ప్రతిపక్షాల ప్రకటన తెలిపింది.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపీ) మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో లోక్‌సభ, రాజ్యసభల్లోని అన్ని విపక్షాల ఫ్లోర్ లీడర్‌ల సమావేశం జరిగిన తర్వాత ఈ ప్రకటన విడుదలైంది.
కాంగ్రెస్‌తో పాటు ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్), జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జెకెఎన్‌సి), తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (ఎండీఎంకే), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే), శివసేన, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నేతలు పాల్గొన్నారు.
కాగా, పార్లమెంట్‌లో ప్రభుత్వ వ్యూహంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు తదితరులు హాజరయ్యారు.
ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై ప్రభుత్వం జిఎస్‌టి విధించడం వంటి వాటి డిమాండ్లపై ప్రతిపక్షాలు బుధవారం పార్లమెంటు ఉభయ సభలలో ఆందోళనలలు చేయడంతో ఈ పరిణామం జరిగింది.
ముఖ్యంగా, ఈరోజు సభా కార్యక్రమాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే కొందరు ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 18న ప్రారంభమయ్యాయి. ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.
సంబంధిత కథనం